కొత్త స్ట్రాటజీతో దూసుకెళ్తున్న నటసింహం బాలయ్య

Share


టాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాలుగా తనదైన మాస్ ఇమేజ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు రొటీన్ మాస్, కమర్షియల్ కథలకే పరిమితమైన బాలయ్య, ఇప్పుడు కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న, స్టైలిష్ ట్రీట్‌మెంట్‌తో కూడిన విభిన్న కథలను ఎంచుకుంటూ ట్రెండ్ మార్చుతున్నారు. ఇదే కారణంగా యంగ్ డైరెక్టర్లకు బాలయ్య హాట్ ఫేవరెట్‌గా మారడం విశేషం.

గత ఏడాది ప్రారంభంలో ‘డాకు మహారాజ్’తో విజయాన్ని అందుకున్న బాలయ్య, ఆ తర్వాత ‘అఖండ 2’తో మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించారు. సినిమా ఓవరాల్‌గా సూపర్ హిట్ కాకపోయినా, వయసుతో సంబంధం లేకుండా వరుస యాక్షన్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న తీరు ప్రశంసనీయం. బాలయ్య సినిమా రిలీజ్ అయితే ఇప్పటికీ థియేటర్లలో కనిపించే హంగామా ఆయన స్టార్‌డమ్‌కు పర్ఫెక్ట్ ఎవిడెన్స్.

ఇప్పుడు బాలయ్య అప్‌కమింగ్ ప్రాజెక్టులపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముగ్గురు దర్శకుల పేర్లు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. ముందుగా గోపీచంద్ మలినేని. ఆయన దర్శకత్వంలో NBK 111 ప్రాజెక్ట్ ఇప్పటికే అనౌన్స్ అయ్యింది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబో రిపీట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 19 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.

యాక్షన్ డ్రామాకు ఫ్యామిలీ సెంటిమెంట్ జోడించి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఉగాది తర్వాత షూటింగ్ వేగం పెంచి, దసరా కానుకగా విడుదల చేయాలన్న ప్లాన్ కూడా ఉందట.

ఇదే సమయంలో ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా బాలయ్య కోసం పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ మాస్ ఎలిమెంట్స్‌తో కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ‘డాకు మహారాజ్’ను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారని, వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట.

అయితే అందరిలో ఎక్కువ ఆసక్తి రేపుతున్న కాంబినేషన్ మాత్రం వివేక్ ఆత్రేయ – బాలయ్య మూవీ. ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న వివేక్, బాలయ్యను పూర్తిగా కొత్త యాంగిల్‌లో చూపించే కథ సిద్ధం చేశారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశముందని, 2027 మధ్యలో విడుదల చేయాలన్న ప్లాన్ వినిపిస్తోంది.

వివేక్ ఆత్రేయతో సినిమా అంటే.. బాలయ్య నిజంగా ప్రయోగాత్మక దారిలో అడుగులు వేస్తున్నారని చెప్పాలి. మొత్తానికి తన పంథాను మార్చుకున్న నటసింహం లైనప్ ఇప్పుడు మాస్, స్టైలిష్, కంటెంట్ ఓరియెంటెడ్, ఎక్స్‌పెరిమెంటల్ సినిమాల మిక్స్‌డ్ బ్యాగ్‌లా కనిపిస్తోంది. మరి ఈ కొత్త స్ట్రాటజీతో బాలయ్య ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.


Recent Random Post: