జయసుధ మూడో పెళ్లి? ఇంతకూ ఆమె ఏమన్నారు?

సహజనటిగా జయసుధకు ఉన్న పేరుప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా అందులో జీవించే ఆమె చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగు పెట్టిన వైనం తెలిసిందే. సీనియర్ నటులైన ఎన్టీఆర్.. ఏఎన్నార్ మొదలుకొని అగ్రహీరోలతో జత కట్టిన ఆమె.. సీనియర్ నటిగా ఇప్పటికి తిరిగులేని ఛరిష్మాలో సాగుతున్నారు. కొన్ని పాత్రలకు ఆమె తప్పించి మరెవరూ న్యాయం చేయలేరన్న పేరు ఆమె సొంతం. యాభై ఏళ్ల ఆమె సినీ ప్రస్థానం ఒకవైపు.. మరోవైపు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి తాజాగా వైరల్ అవుతున్న ఒక వార్త కలకలాన్ని రేపుతోంది.

జయసుధ మూడో పెళ్లికి సిద్ధమవుతున్నారన్నది ఆ వార్త సారాంశం. దీనికి కారణం.. ఇటీవల ఆమె వెంట ఒక విదేశీయుడు తరచూ కనిపించటమే. దీంతో.. పుకార్లు షికార్లు చేశాయి. ఇలాంటి వాటిని అదే పనిగా ప్రసారం చేసే కన్నా.. అదే విషయాన్ని ఆమెతో సూటిగా ప్రస్తావించింది ఒక మీడియా సంస్థ. మూడో పెళ్లి చేసుకోనున్నారట కదా? అన్న ప్రశ్నకు విస్మయాన్ని వ్యక్తం చేసిన ఆమె.. మూడో పెళ్లేంటని ప్రశ్నించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రాల్లో ఒకటైన వారసుడు చిత్రంలో కీలక పాత్ర పోషించారు.

ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమంలో జయసుధ వెంట ఒక విదేశీయుడు ఉండటం.. ఆమెకు సంబంధించిన అన్ని వివరాల్ని తెలుసుకోవటం.. ఆయనకు వివరించటం లాంటివి పలువురిని ఆకర్షిస్తున్నాయి. దీంతో.. అదిగో తోక అంటే.. ఇదిగో ఆవు అన్నట్లుగా మూడో పెళ్లిపై వార్తల్ని వండేశారు. అయితే.. అతను తన బయోపిక్ తీసేందుకు ఇండియాకు వచ్చిన వ్యక్తిగా జయసుధ క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో తన ప్రాధాన్యత.. తనకు ఇచ్చే గౌరవాన్ని స్వయంగా చూడటం ద్వారా మరింత బెటర్ ఫీల్ ఉండేలా సినిమాను తీసేందుకు వీలుగా తన ప్రతి ఈవెంట్ కు హాజరవుతున్నట్లుగా ఆమె వెల్లడించారు.

అతని పేరు ఫెలిపే రూయేల్స్ అని.. తన బయోపిక్ తీస్తున్నట్లుగా చెప్పారు. తన గురించి ఇంటర్నెట్ లో పలు వివరాల్ని తెలుసుకున్నారని.. కానీ తనకున్న ఫాలోయింగ్ ఏంత? తన సినిమాలు.. షూటింగ్స్ వివరాల్ని తెలుసుకునేందుకుతనను ఫాలో అవుతున్నారే తప్పించి మరింకేమీ లేదన్నారు. ఇటీవల అమెరికాకు వెళ్లినప్పుడు తానుకలిసినట్లుగా చెప్పారు. జయసుధ మొదటి పెళ్లి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడగా.. తర్వాత విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కజిన్ నితిన్ కపూర్ ను పెళ్లాడారు. అనారోగ్య సమస్యలతో 2017లో ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి తోడు ఆమె కొంతకాలం క్రితం క్రైస్తవంలోకి మారారు. తాజాగా తీస్తున్న బయోపిక్ కూడా అధ్యాత్మిక కోణంలో ఉంటుందని చెబుతున్నారు.


Recent Random Post: