జూహీ చావ్లా సంపదలో ఒక్క ఏడాదిలో రూ.3,190 కోట్ల జంప్

Share


బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోనూ సుపరిచితురాలైన జూహీ చావ్లా నటిగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా తనదైన ముద్ర వేసింది. అక్కినేని నాగార్జున సరసన విక్కీ దాదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జూహీ, హిందీ చిత్రసీమలో అనేక బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించింది. అనంతరం నిర్మాతగా మారి పలు చిత్రాలను నిర్మించింది.

సినిమాలకే పరిమితం కాకుండా, ఐపీఎల్ పెట్టుబడులు కూడా జూహీ చావ్లా కెరీర్‌లో కీలక పాత్ర పోషించాయి. షారూఖ్ ఖాన్‌తో కలిసి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టడం ఆమెను దేశంలోనే అత్యంత సంపన్న సెలబ్రిటీలలో ఒకరిగా నిలబెట్టింది. ఈ పెట్టుబడులు జూహీ చావ్లా, ఆమె భర్త జే మెహతాలను రిచెస్ట్ ఇండియన్ సెలబ్రిటీ కపుల్స్‌గా మార్చాయి.

హురూన్ ఇండియా సర్వే ప్రకారం, జూహీ చావ్లా–జే మెహతా దంపతుల నికర ఆస్తుల విలువ రూ.7,790 కోట్లుగా నమోదైంది. అయితే 2024 నాటికి ఈ విలువ సుమారు రూ.4,600 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. తాజా 2025 హురూన్ లిస్ట్ ప్రకారం, కేవలం ఒక్క ఏడాదిలోనే ఈ జంట తమ సంపదకు అదనంగా రూ.3,190 కోట్లు జోడించింది. ఈ భారీ వృద్ధి వెనుక జూహీ–జే మెహతాల వ్యాపార దూరదృష్టి ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు.

సీనియర్ నటి జూహీ చావ్లా దేశంలోనే అత్యంత సంపన్న నటిగా సంవత్సరాలుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఆమె భర్త జే మెహతా విజయవంతమైన పారిశ్రామికవేత్తగా వివిధ రంగాల్లో బలమైన పట్టు కలిగి ఉన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలో షారూఖ్ ఖాన్‌తో కలిసి సహయజమానిగా ఉన్న జే మెహతా, అలాగే రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్తో జూహీకి ఉన్న అనుబంధం కూడా వారి వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది.

అంతేకాకుండా, రియల్ ఎస్టేట్ రంగంలోనూ జూహీ చావ్లా–జే మెహతా జంటకు మంచి పేరు ఉంది. జూహీ గత 15 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, లాభసాటి వ్యాపారాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. ఐపీఎల్, రియల్ ఎస్టేట్ సహా పలు రంగాల్లో చేసిన పెట్టుబడులు భారీ లాభాలు తీసుకురావడంతో, వారి ఆస్తుల విలువ ఏటేటా వేగంగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.


Recent Random Post: