
‘డీజే టిల్లు’ హిట్ ప్రాంచైజీగా మారిపోయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాంతో, సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈసారి దర్శకుడు మారిపోయాడు. రామ్ నాయక్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించగా, సినిమా అంచనాలను మించే విజయాన్ని సాధించింది.
ఈ సీక్వెల్ ద్వారా సిద్ధు జొన్నలగడ్డను 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశింపజేసింది. దీంతో ‘టిల్లు బాబు’ ఓ బ్రాండ్‌గా మారిపోయాడు. ఈ సక్సెస్ నేపథ్యంలో ‘డీజే టిల్లు 3’ కూడా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు మరికొంత సమయం పడుతుందని, గ్యాప్ తీసుకుని మరింత భారీ ఎత్తున తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఈ సినిమా అసలు టైటిల్ ‘డీజే టిల్లు’ కాదని, మొదట ‘నరుడు బ్రతుకు నటన’ అనే పేరు అనుకున్నామని సిద్ధు తాజాగా వెల్లడించారు. కానీ, ఆ టైటిల్ కొంచెం పాతదిగా అనిపించడంతో, కొత్త పేరు కోసం వెతికామని చెప్పారు. అదే సమయంలో ‘డీజే టిల్లు’ అనే టైటిల్ ఛాంబర్లో ఇప్పటికే రిజిస్టర్ అయి ఉండడంతో, దాన్ని సుమారు నాలుగు లక్షలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
త్రివిక్రమ్ ఈ కథ వినిపించినప్పుడు ఇది ఒక సాధారణ కథ అనుకున్నానని, కానీ సినిమా చూసిన తర్వాత ఇది అందుకు భిన్నమైన కథ అని అభిప్రాయపడ్డారట. టైటిల్ మార్చిన విషయం తమకు ఎంతగానో కలిసొచ్చిందని సిద్ధు తెలిపారు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. త్రివిక్రమ్ ఈ నిర్మాణ సంస్థకు కీలక మార్గదర్శిగా వ్యవహరిస్తుండడంతో, ఆయన్ను సంప్రదించకుండా సినిమా ముందుకు వెళ్లదనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే.
Recent Random Post:















