తండ్రి జ్ఞాపకంతో భావోద్వేగానికి గురైన తమన్

Share


మ్యూజిక్ డైరెక్టర్ తమన్ టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలతో పాటు పలు పాన్ ఇండియా ప్రాజెక్టులకు సంగీతం అందిస్తూ బిజీగా కొనసాగుతున్నాడు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో జరిగిన అనేక అనుభవాలను షేర్ చేసుకున్నాడు. అనుభవంతో ఏదైనా సాధించొచ్చని చెబుతున్న తమన్, నాగచైతన్య నటించిన మజిలీ సినిమాకు కేవలం వారం రోజుల్లోనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేసినట్లు వెల్లడించాడు.

ఈ ఇంటర్వ్యూలో తమన్ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. తాను 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన తండ్రి మరణించారని, అప్పటికి తన చెల్లెలు రెండో తరగతి చదువుతోందని చెప్పాడు. తండ్రి శవాన్ని అంబులెన్స్‌లో తీసుకొచ్చినప్పుడు తాను కన్నీటి చుక్క కూడా పెట్టలేకపోయానని, అందరూ ఏడుస్తున్నా తాను మాత్రం ఏమీ చేయలేకపోయానని వెల్లడించాడు. ఆ క్షణమే అమ్మను, చెల్లిని ఎలా చూసుకోవాలనే ఆలోచనలో పడ్డానని తమన్ చెప్పాడు. అప్పుడు ప్రముఖ డ్రమ్స్ ప్లేయర్ శివమణి తమ కుటుంబాన్ని పరామర్శించేందుకు రావడం, వారిని చూసి తాను ఎమోషనల్ అయ్యానని తెలిపారు.

తండ్రి మరణానంతరం వచ్చిన ఎల్ఐసీ డబ్బును తనపై నమ్మకంతో తన తల్లి పూర్తిగా తనకు అప్పగించిందని, ఆ డబ్బుతో మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కొనుగోలు చేసి, 11 ఏళ్ల వయసులోనే సంగీతంపై పూర్తి దృష్టిపెట్టినట్లు చెప్పాడు. ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేసినా, తన తల్లి ఎంతో కష్టపడి తనను ఈ స్థాయికి చేర్చిందని, ఇప్పుడు తన తల్లి కోసం ఏదైనా చేయగలనని గర్వంగా చెప్పుకున్నాడు.

అలాగే, గేమ్ ఛేంజర్‌లోని పాటలు అనుకున్న స్థాయిలో రీచ్ కాకపోవడానికి కారణం, వాటిలో హుక్ స్టెప్స్ లేకపోవడమేనని తమన్ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో అల వైకుంఠపురములో పాటలకు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడానికి ప్రధాన కారణం హుక్ స్టెప్స్ అని స్పష్టం చేశాడు. వ్యూస్ కోసం సంగీతం అందించడం తన లక్ష్యం కాదని, పాటల కంటే మంచి సంగీతం అందించడమే తన ధ్యేయమని చెప్పాడు.

ఇప్పటి వరకు 170 సినిమాలకు సంగీతం అందించిన తమన్, తన కెరీర్‌లో అత్యంత కష్టపడి కంపోజ్ చేసిన పాట అరవింద సమేతలోని పెనివిటి పాట అని వెల్లడించాడు.


Recent Random Post: