
నేటి రోజుల్లో సైబర్ నేరాలు, మోసాలు, భారీ దోపిడీల గురించి తరచూ వింటూ నివ్వెరపోతున్నాం. మోసపూరిత ఆఫర్ల పేరుతో లక్షలాది మంది అమాయకులను లక్ష్యంగా చేసుకుని, కోట్లకు కోట్లు దోచేస్తున్న ఘరానా మోసగాళ్లు ఆర్థిక నేరాల పరంగా పెద్ద ప్రమాదంగా మారుతున్నారు. తాజాగా, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ కుమార్తె ఆరుషి నిషాంక్ మోసపోయిన ఘటన సంచలనంగా మారింది.
ఒక దొంగ నిర్మాత ఆమెను తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటానంటూ నమ్మబలికి, ఐదు కోట్లు పెట్టుబడి పెట్టాలని సూచించాడు. సినిమా విడుదల తర్వాత రూ. 15 కోట్లు వస్తాయని, ఆమెకు ఆ పాత్ర నచ్చకపోతే వడ్డీతో సహా డబ్బు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చాడు. ఆరుషి ఈ మాటలు నమ్మి పెట్టుబడి పెట్టగా, చివరికి ఆమెకు ఆశించిన పాత్ర రాలేదు, డబ్బు కూడా తిరిగి రాలేదు.
తన డబ్బును తిరిగి ఇవ్వాలని అడగగానే ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె డెహ్రాడూన్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముంబైకి చెందిన మానసి వరుణ్, వరుణ్ ప్రమోద్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో నిందితులు మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రొడక్షన్ హౌస్ పేరుతో నకిలీ సినిమా ప్రచారం చేసి, ఆరుషి ఫోటోలను వెబ్‌సైట్ నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. నిందితులు ఆమెను చంపుతామని, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటన చూస్తుంటే మోసపోయేది సామాన్య ప్రజలే కాదు, వీవీఐపీలను కూడా మోసగాళ్లు వదలడం లేదని స్పష్టమవుతోంది. ఆర్థిక స్థాయిని బట్టి మోసాల పరిమాణం పెరుగుతోందని, మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటనతో మళ్లీ రుజువైంది.
Recent Random Post:















