నాగచైతన్య 25వ సినిమా ఫిక్స్ – నాగార్జున 100వ సినిమా కూడా త్వరలో!

Share


అక్కినేని నాగచైతన్యకు చాలా కాలం తర్వాత ఓ మంచి హిట్ దొరకడంతో ఆయన కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ‘థాంక్యూ’, ‘కస్టడీ’ వంటి పరాజయాల తరువాత ఈ ఏడాది వచ్చిన ‘తండేల్’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ఈ విజయంతో ఊపుమీదున్న చైతూ, తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా మిస్టిక్ థ్రిల్లర్‌గా ఉండనుంది. ఇది చైతూ కెరీర్‌లో 24వ చిత్రం.

అయితే, ఇక చైతూ 25వ సినిమా ఏదో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రత్యేకమైన మైలురాయి ప్రాజెక్ట్‌ను కొత్త దర్శకుడు కిశోర్ డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. కిశోర్ చెప్పిన కథకు ఇటీవలే చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కమర్షియల్ టచ్‌తో పాటు వినూత్నమైన కథాంశం ఈ చిత్రానికి హైలైట్ కానుందని అంటున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే నిర్మించాలనే ఆలోచన ఉంది, లేకపోతే ఏదైనా బయటి బ్యానర్ ద్వారా రూపొందించే అవకాశమూ ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, చైతూ తండ్రి నాగార్జున కూడా తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకోనున్నారు. ఆయన 100వ చిత్రం గురించి చర్చలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను తమిళ దర్శకుడు నవీన్ తెరకెక్కించనున్నాడనే వార్తలొచ్చాయి, కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆసక్తికరంగా, నాగార్జున 100వ సినిమా, చైతూ 25వ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. అక్కినేని అభిమానులకు ఈ రెండు సినిమాలు ఎంతగానో ఆసక్తిని కలిగిస్తున్నాయి.


Recent Random Post: