నాగార్జునకు ఈ ఏడాది డబుల్ ట్రీట్

Share


టాలీవుడ్ కింగ్ నాగార్జున గత ఏడాది ‘నా సామిరంగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఆయన సోలో హీరోగా కొత్త సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నాగార్జున ఈ ఏడాది రెండు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టేందుకు సిద్ధమవుతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ సినిమా ఈ వారంలో విడుదల కాబోతుండగా, మరో చిత్రం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’. ఈ రెండు చిత్రాలూ తమిళ హీరోలతో కలిసి తెరకెక్కడం విశేషం.

‘కుబేర’ సినిమాలో నాగార్జునతో పాటు ధనుష్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో ప్రచారం జరుగుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ద్వారా నాగార్జున పాత్రపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. పాత్రకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడించకపోయినా, తన పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నాగార్జున కాన్ఫిడెంట్‌గా తెలిపారు. ఇటీవల ఆయన పలు ఇంటర్వ్యూలలో, ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమా పట్ల తన నమ్మకాన్ని పంచుకున్నారు.

మరోవైపు ‘కూలీ’ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్న నాగార్జున, ఈ కథను వినిపించేందుకు వచ్చిన సమయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనదైన స్టైల్‌లో “విలన్‌గా చేయాలంటే అభ్యంతరం ఉంటే కప్పు టీ తాగి వెళ్లిపోదాం” అని చెప్పాడట. ఈ మాటలే దర్శకుడి ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్‌ను తెలియజేశాయంటూ నాగార్జున గుర్తు చేశారు. కూలీ సినిమాలోని పాత్ర పూర్తిగా నెగటివ్ షేడ్స్‌తో కూడుకున్నదే అయినా, స్క్రిప్ట్ నచ్చడంతో ఒప్పుకున్నట్టు తెలిపారు.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున, శేఖర్ కమ్ముల మరియు లోకేష్ కనగరాజ్ స్టైల్ మధ్య తేడాలను కూడా ఆసక్తికరంగా వివరించాడు. లోకేష్ తనకు “పులిలా నడవండి సార్‌” అని చెప్పేవాడని, అదే సమయంలో శేఖర్ కమ్ముల మాత్రం “సింపుల్‌గా ఉండండి, అతిగా నటించొద్దు” అని చెబుతూ నటనలో మాధుర్యాన్ని కోరుకున్నారని చెప్పాడు. ఈ రెండూ పూర్తిగా భిన్నమైన అనుభవాలుగా పేర్కొన్నాడు.

ఈ రెండు చిత్రాల తర్వాత నాగార్జున కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ‘హిట్’ ఫ్రాంచైజీ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతున్నట్టు బీహైండ్ ద స్క్రీన్ టాక్ ఉంది. కథా చర్చలు పూర్తయ్యాయని, ‘కుబేర’ విడుదల అనంతరం ఆ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, తనయుడు అఖిల్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయాలని కూడా నాగార్జున ప్లాన్ చేస్తున్నాడట.

ఇలా చూస్తే నాగార్జున ఇప్పటి వరకూ తక్కువగా కనిపించినా, ఈ ఏడాది మాత్రం రెండు డిఫరెంట్ సినిమాల ద్వారా ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. సోలో హీరోగా కాకపోయినా, బలమైన పాత్రలతో మళ్లీ తన స్థాయిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ‘కుబేర’ మరియు ‘కూలీ’ సినిమాలు ఆయన కెరీర్‌లో మరో మైలు రాయిగా నిలవవచ్చనే విశ్వాసం ఇప్పుడు అభిమానుల్లో కనిపిస్తోంది.


Recent Random Post: