నితేష్ తివారీ రామాయణం, గ్లోబల్ రేంజ్‌లో గ్రాండ్ ప్రాజెక్ట్

Share


నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం గురించి చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా రామాయణ మహత్యాన్ని అందరికీ తెలియజేయాలనే లక్ష్యంతోనే ఈ సినిమా రూపొందిస్తున్నామని, గ్రాండ్ విజువల్స్, అత్యాధునిక టెక్నాలజీతో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో రామాయణం ఆస్కార్ అవార్డు గెలుచుకుంటుందా అనే ప్రశ్నకు నమిత్ ఆసక్తికరంగా స్పందించారు. విజువల్స్ కీలకంగా ఉండే ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ రేసులో నిలిచే అవకాశం ఉందని, అంతేకాకుండా ఒక సినిమా విజయాన్ని సరైన ప్రమోషన్ నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డారు. గతంలో ఓ స్టార్ హీరో చేసిన రామాయణ కథ ఆధారిత సినిమా విమర్శలకు గురైన నేపథ్యంలో, తాము ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.

రామాయణం కథను తెరకెక్కించే అవకాశం అందరికీ రాదు. అందుకే, మనోభావాలను దెబ్బతీయకుండా, అన్ని కోణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా రూపొందిస్తున్నామని నమిత్ అన్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేస్తామని, హాలీవుడ్ చిత్రమైన ‘ఓప్పెన్ హైమర్’ కు దక్కిన స్థాయిలో ఈ రామాయణం కూడా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రాంచంద్రుడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ నటించనున్నారని సమాచారం.

ఈ రామాయణం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఫస్ట్ పార్ట్ 2026లో, సెకండ్ పార్ట్ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, నమిత్ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమాను ఉద్దేశించి చేసినవేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి నిర్మాతగా నమిత్ మల్హోత్రాతో పాటు యశ్ కూడా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.


Recent Random Post: