మొన్న సామాజిక పెన్షన్లకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్ల విషయమై ‘పెంచుకుంటూ పోతాం’ అని వైఎస్ జగన్ సర్కార్ ‘బుకాయిస్తున్న’ వైనం గురించి విన్నాం. ఇప్పుడిక, పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కూడా జగన్ సర్కార్ ‘పెంచుకుంటూ పోతాం’ అంటోంది.
ప్రస్తుతానికైతే పోలవరం ప్రాజెక్టు పనులు 41.5 మీటర్లకు తగట్టుగానే పూర్తి చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అధికారులకు చేసిన దిశా నిర్దేశం తాలూకు సారాంశం. పోలవరం ప్రాజెక్టుని సందర్శించి, అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, 41.5 మీటర్ల ఎత్తుకు తగ్గట్టుగానే ముంపు – పునరావాసం ప్రక్రియ పనులు పూర్తి చేయాలని ఆదేశించారట.
మరి, ‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు.. ఒక్క ఇంచు కూడా తగ్గదు..’ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పడమేంటట.? ఏమో, ఈ మతలబు ఏంటోగానీ, ‘కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేటప్పుడు ఒకేసారి పూర్తిస్థాయ నీటి నిల్వ జరగదనీ, క్రమంగా ఎత్తు పెంచుకుంటూ పోతారనీ, పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అదే జరుగుతుందనీ’ అధికార వైసీపీ చెబుతోంది.
కొన్నాళ్ళ క్రితం ఇదే వాదనను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా తెరపైకి తెచ్చారు. మొత్తమ్మీద, ప్రాజెక్టు ఎత్తు విషయమై ఇంకా గందరగోళం కొనసాగుతూనే వుందన్నమాట.
అయితే, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ముంపు – పునరావాసం అనేది అత్యంత కీలకమైన వ్యవహారం. వేల కోట్ల నిధులతో ముడిపడి వున్న అంశమిది. ముంపు ప్రాంతం చాలా ఎక్కువగా వుండే అవకాశం వున్నందున, పునరావాసం కోసం పెద్దయెత్తున ఖర్చు చేయాల్సి వుంటుంది. అంత ఖర్చు భరించే పరిస్థితుల్లో రాష్ట్రం లేదు. కేంద్రమేమో, ముంపు పరిహారం విషయంలో మీనమేషాల్లెక్కిస్తోంది.
ప్రాజెక్టు పూర్తి కావాలంటే, ఎత్తు 45.7 మీటర్లు పూర్తవ్వాల్సిందే. కానీ, 41.5 మీటర్ల వరకు నీటి నిల్వ చేసే సామర్థ్యంతో ప్రాజెక్టుని పూర్తి చేసేసి ‘మమ’ అన్పించేయబోతున్నారన్నమాట. ఇక్కడే కన్‌ఫ్యూజన్ పూర్తిస్థాయిలో కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో 2021 డిసెంబర్ చివరి నాటికి ప్రాజెక్టు పూర్తయిపోవాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం. మరి, ఈ ఎత్తు గందరగోళంపై ఎప్పటికి క్లారిటీ వచ్చేను.? అంటే, అదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.
Recent Random Post: