బన్నీ నెక్స్ట్ సర్‌ప్రైజ్: మలయాళ దర్శకుడితో పాన్ ఇండియా సినిమా

Share


టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడైన అల్లు అర్జున్‌ తన సినిమాల ఎంపికలో ఎప్పుడూ ప్రత్యేకమైన రూట్‌ను ఫాలో అవుతాడు. ఏ ప్రాజెక్ట్‌ను ఓకే చేస్తాడో, ఏది డ్రాప్ చేస్తాడో చివరి వరకూ ఎవ్వరూ ఊహించలేరు. ఇప్పటివరకు అనేక ప్రాజెక్టులు వార్తల్లోకి వచ్చి, చర్చల్లో నిలిచి, చివరికి నిలదొక్కుకోలేక ఆగిపోయాయి. ప్రేక్షకులు ఒక అంచనాతో ఎదురు చూస్తే, బన్నీ ఆ అంచనాలకు భిన్నంగా సర్వప్రత్యేకమైన ప్రాజెక్టును ఎన్నుకుంటాడు.

ఇప్పుడు పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా మొదలవుతుందన్న ఊహాగానాలు నడిచినా, అనూహ్యంగా అట్లీ సినిమా సెట్స్ మీదికి తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్‌తో జట్టు కడతాడా? అన్న దానికీ క్లారిటీ వచ్చేసింది. త్రివిక్రమ్ సిద్ధం చేసిన కుమారస్వామి కథను Jr. ఎన్టీఆర్‌తో చేయబోతున్నాడు. అందుకే బన్నీ తన తదుపరి సినిమా కోసం కొత్త దర్శకుడి వైపు దృష్టి సారించాడు.

తాజాగా బన్నీకి అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ — బన్నీ కొత్త సినిమా అందరికీ పెద్ద షాకివ్వబోతుందని చెప్పారు. ఆ కలయికను ఎవరూ ఊహించరని, బన్నీ ఎప్పుడూ తనదైన స్టైల్‌లో ముందుకెళ్లతాడని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ సర్ప్రైజ్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి.

ఈసారి అల్లు అర్జున్ మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో కలిసి పనిచేయబోతున్నారని సమాచారం. నటుడిగా మంచి గుర్తింపు సంపాదించిన బాసిల్, దర్శకుడిగా కూడా మిన్నల్ మురళి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించాడు. సూర్యతో సినిమా చేస్తున్నాడన్న వార్తలు వచ్చినా అవి నిజం కాదని తెలుస్తోంది. బాసిల్ ప్రస్తుతం బన్నీ కోసం ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని, ఇది మలయాళ నేపథ్యంతో భారతవ్యాప్తంగా రూపొందబోతుందని టాక్ వినిపిస్తోంది.

బన్నీ వాసు తెలిపినట్టుగా, వచ్చే నాలుగు నెలల్లో బన్నీ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు బాసిల్ దర్శకత్వంలోనే ఉండొచ్చని సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది.


Recent Random Post: