
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇటీవల తన 60వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకున్నారు. ఆ రోజు ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘కింగ్’ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘పఠాన్’ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ – షారుక్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదలైంది. ఆ వీడియో చూసి సినిమా పెద్ద స్థాయిలో తెరకెక్కుతోందని స్పష్టమవుతోంది.
అయితే టైటిల్, గ్లింప్స్ రిలీజ్ అయినా కూడా, ‘కింగ్’ సినిమాపై ప్రేక్షకులలో ఆశించినంత బజ్ రాలేదు. కొంతమంది అభిమానులు మాత్రం షారుక్ ఈసారి ఏ కొత్తదనం చూపిస్తారో అని ఆసక్తిగా ఉన్నప్పటికీ, మరికొందరు మాత్రం బాలీవుడ్ యాక్షన్ సినిమాలు పాత శైలి కోల్పోయాయని భావిస్తున్నారు. భావోద్వేగపరంగా కూడా సినిమాలు బలహీనంగా మారిపోయాయని వారి అభిప్రాయం.
గతంలో వచ్చిన యాక్షన్ సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించేవి. టెక్నాలజీ, విజువల్స్ పరంగా ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగినా, ఆత్మ, ఎమోషన్ లేకపోవడం వల్ల సినిమాలు కనెక్ట్ కావడం లేదని విమర్శిస్తున్నారు. అప్పట్లో యాక్షన్ సీన్స్‌లో ఉండే రియలిజం, ఫైట్స్‌లో ఉండే ఇన్టెన్సిటీ ప్రేక్షకులను థ్రిల్చేసేది. కానీ ఇప్పుడు ఎక్కువగా ఎడిటింగ్ ట్రిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాంత్రిక కదలికలతో సన్నివేశాలు నింపేస్తున్నారని కొంతమంది సినీప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అలాగే అప్పట్లో గబ్బర్ సింగ్, క్రైమ్ మాస్టర్ గోగో వంటి విలన్లు గుర్తుండిపోయేలా నటించేవారు. కానీ ఇప్పటి తరంలోని విలన్లు ఆ స్థాయికి చేరడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు యాక్షన్ సినిమాల్లో హీరో కోపం వెనక ఉన్న ఉద్దేశం కూడా సరిగ్గా చూపించడం లేదని అభిమానులు చెబుతున్నారు.
ఒక యాక్షన్ సినిమా విజయం సాధించాలంటే కథ, కంటెంట్, ఎమోషన్ మీద నమ్మకం ఉండాలి. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్ల కోసమే సినిమాలు తయారవుతున్నాయని అభిమానులు అంటున్నారు. అందుకే పాత రోజుల్లో లాగా కథా బలం, భావోద్వేగాలు, యాక్షన్ కలిపిన నిజమైన బాలీవుడ్ యాక్షన్ సినిమాలు మళ్లీ రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
Recent Random Post:














