మీడియా వక్రీకరణపై ఫైర్ అయిన అనస్వర రాజన్

Share


అనస్వర రాజన్… ఓ కేరళ కుట్టి. మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ రేఖా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మలయాళ భామ, ఛాంపియన్ సినిమాతో తెలుగులోనూ అడుగుపెట్టింది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా పరిచయం అవుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ విత్ లవ్లో అనస్వర కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని మరికొంతమంది నిర్మాతలతో కలిసి రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభమైన ఈ మూవీని ఫిబ్రవరి 6న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో అనస్వరకు ఏర్పడిన క్రేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను టీమ్ భారీగా ప్లాన్ చేసింది. డ్రోన్ షోతో తమిళ ఇండస్ట్రీలో తొలిసారి ఇలాంటి వినూత్న ప్రమోషన్‌కు తెరలేపారు. ఇప్పటికే తమిళనాట ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ ప్రమోషన్స్ సమయంలో ఓ తమిళ మీడియా సంస్థ చేసిన అతిశయోక్తి అనస్వరకు చిరాకు తెప్పించిందని తెలుస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అనస్వర ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. కానీ ఆమె మాట్లాడిన మాటలకు మరో వాక్యాన్ని జోడించి, దాన్నే హైలైట్ చేస్తూ టైటిల్ పెట్టి ఆ కథనాన్ని ప్రచురించారట. దీంతో ఆమె మాటలను తప్పుదోవ పట్టించేలా వక్రీకరించారని అనస్వర తీవ్రంగా మండిపడింది. సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

“దీనిని రూపొందించిన వారికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. తేలికపాటి సంభాషణలు, నవ్వులతో నిండిన పూర్తి 20 నిమిషాల తమిళ ఇంటర్వ్యూలో సరదాగా చెప్పిన ఒక్క వ్యాఖ్యను మాత్రమే పట్టుకుని, దాన్ని ఏదో తీవ్రమైన ప్రకటనలా చూపించడానికి చాలా ఓపిక కావాలి. అది జర్నలిజం కాదు. చెప్పిన సందర్భాన్ని వక్రీకరించి, లేని చోట వివాదాన్ని సృష్టించడమే. ఒక జోక్‌ను అతిగా ప్రచారం చేయడం మిమ్మల్ని తెలివైనవారిగా చూపించదు. అది కేవలం ప్రచారం కోసం మీరు ఎంత ఉబలాటపడుతున్నారో మాత్రమే చూపిస్తుంది” అంటూ ఆమె ఫైర్ అయ్యింది. ఇటీవల కొన్ని విమర్శలకు స్పందించకుండా ఉండాలని నిర్ణయించుకున్నానని, కానీ తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగినప్పుడు స్పందించాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే, విత్ లవ్ తర్వాత అనస్వర రాజన్ మరో క్రేజీ సీక్వెల్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయబోతోంది. ఆమె నటిస్తున్న రొమాంటిక్ లవ్ డ్రామా 7/జి రెయిన్‌బో కాలనీ 2 ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, 2004లో రవికృష్ణ–సోనియా అగర్వాల్ జంటగా వచ్చిన సంచలన చిత్రం 7/జి రెయిన్‌బో కాలనీకి సీక్వెల్. అప్పట్లో తమిళం, తెలుగులో భారీ విజయం సాధించిన ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ సీక్వెల్ కూడా రెండు భాషల్లోనే విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.


Recent Random Post: