టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి గత కొంతకాలంగా పరిస్థితులు అనుకూలంగా లేకుండా మారాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు పలువురు హీరోలు నిలకడగా విజయాలు అందుకోలేకపోతున్నారు. భారీ అంచనాలతో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తుండటంతో నిర్మాతలు, బయ్యర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
సమీప కాలంలో మెగా ఫ్యామిలీకి వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘విరూపాక్ష’. సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా 2023లో భారీ విజయాన్ని సాధించింది. అంతకుముందు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో విజయం సాధించగా, ఆ తర్వాత విడుదలైన ప్రతి సినిమా నిరాశగా మారింది. ‘బ్రో’, ‘భోళా శంకర్’, ‘గాండీవధారి అర్జున’, ‘ఆదికేశవ’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’, ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మిగిలాయి.
రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా ఫెస్టివల్ హాలిడేస్ ముగిసేలోపే డిజాస్టర్‌గా మిగిలింది. 50 శాతం కంటే తక్కువ రికవరీ చేసిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌కు మరో భారీ షాక్‌గా మారింది.
చిరంజీవి ‘భోళా శంకర్’తో పెద్ద డిజాస్టర్‌ను ఎదుర్కొంటే, సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ సినిమాతో నిరాశ పరిచాడు. వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’తో మరో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుణ్ తేజ్ వరుసగా ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ వంటి సినిమాలతో కష్టాలను ఎదుర్కొంటున్నాడు.
మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం రాబోయే సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు. ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, ‘SYG’, ‘విశ్వంభర’ వంటి చిత్రాలు మెగా హీరోల సక్సెస్ ట్రాక్‌ను మళ్లీ పుంజుకోవాలని కోరుకుంటున్నారు. రాబోయే కాలంలో మెగా ఫ్యామిలీ తమ ట్రాక్ రికార్డ్‌ను మెరుగుపరచి ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తారేమో చూడాలి.
Recent Random Post: