
ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, షూటింగ్ ప్రారంభం కాలేదు. కానీ రవితేజ 76 వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందని వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం మాస్ మహారాజా తన మాస్ జాతర సినిమాను పూర్తి చేసే పనిలో ఉండగా, తాజాగా దర్శకుడు తిరుమల కిషోర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కథ దాదాపుగా లాక్ అయినప్పటికీ, ఫైనల్ వెర్షన్ వినిపించిన తర్వాతే అధికారిక అంగీకారం, ఒప్పందాలు జరుగుతాయని అంటున్నారు.
అయితే, ఇప్పటి నుంచే 2026 సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రచారం ఊపందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఏకంగా పెళ్లి కాకుండానే పిల్లలకు పేరు పెట్టినట్టు ఉంది. అంత తొందరపాటు ఎందుకు అనేదే అసలు ప్రశ్న.
గతంలో ఇదే తరహాలో ఈగల్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నా, అప్పటికే బరిలో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, హనుమాన్ సినిమాలు ఉండటంతో నిర్మాత TG విశ్వప్రసాద్ ఫిబ్రవరికి వాయిదా వేశారు. అది హిట్ కాలేకపోయినా, పోటీ తగ్గడంతో సోలోగా రిలీజ్ చేసి మంచి రెవెన్యూ సాధించారు.
ఇప్పుడు 2026 సంక్రాంతికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ దాదాపు కన్ఫర్మ్. అలాగే చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా కూడా వాయిదా లేకుండా రావొచ్చు. ఇవి కాకుండా మరిన్ని బిగ్ బడ్జెట్ సినిమాలు రంగంలోకి దిగే అవకాశముంది. మాములుగా ఈ సీజన్‌కి మాస్ మసాలా సినిమాలు లేదా విజువల్ ఫాంటసీలు ఎక్కువగా వర్కౌట్ అవుతాయి.
కానీ తిరుమల కిషోర్ సినిమాలు ఎక్కువగా సున్నితమైన కథలు, భావోద్వేగాలతో నడుస్తాయి. రవితేజ కథానాయకుడిగా ఉన్నా, పూర్తిగా ఊర మాస్ స్టైల్‌కి వెళ్లడం కష్టమే. గతంలో రామ్‌తో చేసిన రెడ్ కూడా కొంత మాస్ యాక్షన్ ట్రై చేసినా, తమిళ రీమేక్ ఫ్లేవర్ వల్ల పెద్ద విజయం సాధించలేదు.
కాబట్టి, ముందుగా రవితేజ 76 జానర్ ఎలాంటిదో స్పష్టత రావాలి. అందుకు ముందు నుంచే సంక్రాంతి రిలీజ్ అంటూ ఊరిస్తే, చివరికి వాయిదా పడితే అభిమానులకు నిరాశే మిగిలేది. అందుకే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయడమే మంచిది!
Recent Random Post:















