
తెలుగు సినిమా శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఇప్పుడు మరోసారి తెలుగు చిత్రసీమ గౌరవాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టబోతున్నారు. ‘బాహుబలి 2’ చిత్రంతో 2019లో రాయల్ అల్బర్ట్ హాల్ వేదికపై ఘనంగా ప్రవేశించిన ఆయన, ఇప్పుడు ‘RRR’ చిత్ర సంగీతాన్ని అక్కడే ప్రత్యక్ష ప్రదర్శనగా చూపించేందుకు సిద్ధమయ్యారు.
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాయల్ ఫిల్హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రా సమక్షంలో, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన పాటలను బెన్ పోప్ నేతృత్వంలో లైవ్ ప్రదర్శనగా వినిపించనున్నారు. ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్రత్యేకంగా మార్చే అంశం ఏమిటంటే, ప్రస్తుతం SSMB29 కోసం రాజమౌళితో కలిసి పని చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరవుతుండడం.
అంతే కాదు, RRR హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. ముగ్గురు టాప్ స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపించనున్న ఈ అరుదైన సందర్భం సినీ అభిమానులకు నిజమైన పండుగే చెప్పాలి. ఈ ముగ్గురి కలయికలో ఒక ఫొటో పడితే, అది సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే మహేష్ తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ఇప్పటికే లండన్ చేరుకున్నారట, మేడమ్ టుస్సాడ్స్‌లో తన విగ్రహ ఆవిష్కరణ అనంతరం, ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. ఎన్టీఆర్ కూడా షో కోసం సిద్ధంగా ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘నాటు నాటు’ పాటతో సహా, RRR మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్కి ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. సంగీత ప్రియులు, సినిమా అభిమానులు అందరూ ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌ను ఆస్వాదించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఇది కేవలం సంగీత ప్రదర్శన మాత్రమే కాక, తెలుగు సినిమా సంస్కృతిని ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రతిబింబించే ఘన ఘట్టంగా నిలవబోతోంది.
Recent Random Post:















