
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆమె స్వీయ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఎస్.సరస్వతి’ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎలాంటి ముందస్తు హంగామా లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.
వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టిన ఈ చిత్రంలో జీవా, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రియమణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఒక నర్సు తన కూతురి కోసం వ్యవస్థతో చేసే పోరాటమే ఈ కథకు కేంద్రబిందువు. నటిగా తన ముద్ర వేసుకున్న వరలక్ష్మి, ఈ సినిమాతో దర్శకురాలిగా కొత్త కోణాన్ని చూపించారు.
కథ ప్రకారం, లక్ష్మి (వరలక్ష్మి) అనే అనాథ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంటుంది. ఒక రోజు తన కూతురు ఎస్.సరస్వతిని స్కూల్లో దించి వెళ్తుంది. కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేసరికి ఆ పాప కనిపించదు. స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే, ఆ పేరుతో తమ స్కూల్లో ఎలాంటి విద్యార్థి లేడని చెప్పడం ఆమెను షాక్‌కు గురిచేస్తుంది. తర్వాత తన కూతురు దారుణ హత్యకు గురైందని లక్ష్మి ఆరోపిస్తుంది, కానీ పోలీస్ విచారణలో ఆధారాలు లభించవు.
న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో లక్ష్మి స్వయంగా రంగంలోకి దిగుతుంది. తన కూతురి మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆమె టార్గెట్ చేసే ఉన్నతాధికారుల హత్యలు కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చేస్తాయి. చివరికి అసలు నిజంగా ఆమె కూతురు ఉందా? లేక ఇది ఆమె మానసిక భ్రమా? అనే ట్విస్ట్‌లు కథను మరో స్థాయికి తీసుకెళ్తాయి.
హీరోయిన్గా ప్రారంభమై, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి ఈ సినిమాతో దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. భావోద్వేగం, సస్పెన్స్, థ్రిల్ అంశాలను సమపాళ్లలో మేళవించారు. ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ వంటి నటుల నటన సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ‘ఎస్.సరస్వతి’ తప్పకుండా చూడదగిన చిత్రం.
Recent Random Post:















