విక్రమ్ ‘వీర ధీర శూర’ – మొదట పార్ట్ 2, తరువాత పార్ట్ 1!

Share


సీక్వెల్ ట్రెండ్ తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో విపరీతంగా పెరిగిపోయింది. బాహుబలి తర్వాత ఈ మోడల్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్, పుష్ప లాంటి బ్లాక్‌బస్టర్లు ఈ ట్రెండ్‌ను మరింత బలపరిచాయి. ఇప్పుడు దాదాపు స్టార్ హీరోలందరూ సీక్వెల్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సాధారణంగా మొదటి భాగం విడుదలయ్యాకనే కొనసాగింపు చిత్రాలు వస్తుంటాయి. కానీ విక్రమ్ నటించిన వీర ధీర శూర మాత్రం ఈ ట్రెండ్‌కు పూర్తి భిన్నంగా ప్రయోగం చేస్తోంది.

ఈ యాక్షన్ డ్రామా ముందుగా మార్చి 27న పార్ట్ 2గా విడుదల కానుంది. తర్వాతే మొదటి భాగం షూటింగ్ మొదలుపెట్టనున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఇది నిజం. ఇంత భారీ రిస్క్ వెనుక దర్శకుడు అరుణ్ కుమార్ కు ఉన్న కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.

దర్శకుడు అరుణ్ కుమార్ తన తొలి సినిమా పరియేరుమ్ పెరుమాళ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చేసిన సేతుపతి, సింధుబాద్ చిత్రాలు పెద్ద హిట్స్ కాకపోయినా, వసూళ్ల పరంగా సేఫ్ అయ్యాయి. ఇటీవల సిద్ధార్థ్ తో చేసిన చిన్నా తమిళంలో మంచి విజయం సాధించింది. ఇదంతా చూసిన విక్రమ్, ముందుగా పార్ట్ 2 విడుదల చేసేందుకు ఓకే చెప్పారట.

వీర ధీర శూర పార్ట్ 2 కు తమిళంలో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, తెలుగులో ఇప్పటివరకు సరైన బజ్ లేదు. విక్రమ్, ఎస్‌జే సూర్య, సూరజ్ లాంటి ప్రముఖ నటులు ఉన్నా, ప్రేక్షకుల్లో ఈ సినిమా గురించి పెద్దగా చర్చ జరుగడం లేదు. ప్రమోషన్లకు తగినంత సమయం లేకపోవడంతో టీమ్ ప్రస్తుతం ఉరుకులు పరుగులు తీస్తోంది. త్వరలోనే హైదరాబాద్‌లో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.

కథ విషయానికి వస్తే, ఒక కిరాణా దుకాణం ఓనర్ అనుకోకుండా ఒక రాత్రి పోలీసు అధికారి, గూండాలతో తలపడాల్సి వస్తుంది. దాన్నుంచి అతను ఎలా బయటపడతాడన్నదే సినిమా కథ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సినిమా మొత్తం చీకటిలోనే జరిగేలా ఉండబోతోందట.

ఈ చిత్రం విజయం సాధిస్తే, పార్ట్ 1 తెరకెక్కించే అవకాశం ఉందని టాక్. సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. మరి ఈ ప్రయోగాత్మక ప్రయత్నం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి!


Recent Random Post: