విజయ్ రాజకీయం లోకి.. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు?

Share


తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం తన చివరి సినిమా ‘జన నాయగన్’ పనులను పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశించనున్న విషయం తెలిసినదే. ఇది ఆయన చివరి సినిమా అనే స్పష్టత కూడా విజయ్ ఇప్పటికే ఇచ్చేశాడు. తాజా పరిణామాలు చూస్తుంటే మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తమిళనాడు రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. ప్రజల మద్దతు ఇప్పుడే సాధించాలి అనే ఆలోచనతో విజయ్ రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జమిలి ఎన్నికల్లో బరిలోకి దిగుతారా లేదా అన్నది తేలాల్సి ఉన్నా, ఆయన ప్రణాళిక మాత్రం ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది.

విజయ్ రాజకీయాల్లోకి వెళ్తే, ఆయన సినీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దళపతి విజయ్ తమిళనాట అశేష అభిమానిని కలిగిన మాస్ హీరో. ఆయనను అభిమానించే వారి సంఖ్య కోట్లలో ఉంది. ఆయన సినిమాలకు థియేటర్ల వద్ద జరిగే జోల్సాలే ప్రత్యక్షంగా చూడదగ్గవి. రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఛరిష్మా కలిగిన హీరో విజయ్ మాత్రమే అన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది.

తల అజిత్ ఆయన స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఉన్న హీరోగా కనిపించినా, సినిమాల పట్ల అతడి ఆసక్తి తగ్గినట్టు కనిపిస్తోంది. అజిత్ ప్రస్తుతం ప్రాజెక్టుల్ని దూరంగా పెడుతూ ఎక్కువగా ప్రయాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మరోసారి అజిత్ vs విజయ్ పోటీ అనేది కనబడటం లేదు.

ఇప్పుడు అందరి దృష్టి సూర్య, ధనుష్, కార్తీ వంటి మిడిల్ జనరేషన్ హీరోలపై ఉంది. సూర్యకు మాస్ మరియు క్లాస్ రెండింటిలోనూ ఫాలోయింగ్ ఉన్నా, ఇటీవల వరుస ఫ్లాపులతో ఆయన మార్కెట్ కాస్త డౌన్ అయింది. ధనుష్ నటనలో ఎనలేని ప్రతిభ చూపించినా, మాస్ ఫాలోయింగ్ పరంగా విజయ్ స్థాయికి చేరలేదు. కార్తీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, స్టార్ పవర్ విషయంలో ఇంకా దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంది.

ఈ నేపథ్యంలో, దళపతి విజయ్ ఖాళీ చేసి వెళ్తున్న స్థానం భర్తీ చేయగల హీరో ఎవరు అన్నది ఆసక్తికరమైన చర్చగా మారింది. రాబోయే సినిమాల్లో ఎవరికి ప్రజల మద్దతు ఎక్కువగా లభిస్తుందో, ఎవరికి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ వరుసగా వస్తుందోనని సినీ వర్గాలు గమనిస్తున్నాయి. ఇప్పటివరకు విజయ్ స్థాయి హవా మళ్లీ కనిపించదనే భావన బలంగా ఉన్నా, ఎవరైనా ఒక్కటీ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొడితే ఈ చర్చ మారిపోయే అవకాశముంది.


Recent Random Post: