
ప్రస్తుతం విశ్వంభర మూవీ జర్నీ ఒక ఎగుడుదిగుడు ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నట్లే అనిపిస్తోంది. మొదట సంక్రాంతి రిలీజ్ అంటూ భారీ హైప్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ కోసం రిలీజ్ వాయిదా వేశారు. తర్వాత మార్చిలో రావొచ్చేమో అని అభిమానులు ఎదురు చూశారు కానీ అప్పటికీ మూవీ రాలేదు. ఇప్పుడేమో ఏప్రిల్ కూడా పూర్తవుతుంది. మేలో విడుదలకు అవకాశమే లేదు. జూన్ కూడా అనుమానాస్పదమే. అందువల్ల చివరి ఆశలు జూలైపై మాత్రమే మిగిలినట్లు కనిపిస్తోంది.
అయితే, జూలైలో రిలీజ్ చేయకపోతే ఆగస్ట్‌లో వార్ 2, కూలి లాంటి భారీ ప్యాన్ ఇండియా సినిమాలు పోటీలో ఉంటాయి. అందువల్ల అనవసరమైన రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందే జూలైలోనే రిలీజ్ చేయాలని ఒత్తిడి ఉంది. అయినా కూడా మూవీ నిర్మాతలు ఇప్పటివరకు ఓ క్లారిటీ డేట్ ఇవ్వకుండా తర్జన భర్జనలోనే ఉన్నారు. అవును, VFX పనులు ఇంకా మిగిలి ఉండొచ్చు. కానీ ఓ డెడ్‌లైన్ పెట్టుకుంటే వాటిని త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది కదా?
ఇంతలో ‘ఘాటీ’ మూవీ కూడా అదే బోటులో ఉంది. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కూడా UV క్రియేషన్స్ నిర్మిస్తుండటం విశేషం. ఒకదానిని పూర్తి చేస్తేనే మరొకదాని రీలీజ్‌కి సంబంధించి నిర్ణయం తీసుకుంటామన్న స్ట్రాటజీతో ఉన్నారు. ‘విశ్వంభర’ డేట్ ఫిక్స్ అయితే ‘ఘాటీ’ కి కూడా స్పేస్ లభిస్తుంది. పబ్లిసిటీ పరంగా రెండు సినిమాలు మళ్ళీ మేళవించకుండా విడిగా ప్రామోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ‘ఘాటీ’ షూటింగ్ పూర్తయిందని, కేవలం కొంత ప్యాచ్‌వర్క్ మాత్రమే పెండింగ్ లో ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
అంతా కలిపి చూస్తే, ముందు ‘విశ్వంభర’ క్లారిటీ రావాల్సిందే. అప్పుడే ‘ఘాటీ’ గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. UV క్రియేషన్స్ రెండు సినిమాల భవిష్యత్తు కోసం తీసుకోబోయే నిర్ణయాలపై పరిశ్రమలో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి.
Recent Random Post:















