
సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయి, ఇంకాసేపట్లో షోలు మొదలవుతాయని భావించిన సమయంలో ఊహించని అవాంతరం ఎదురైతే, నిర్మాతలు ఎదుర్కొనే సమస్యలు చెప్పనలవి కాదు. ఇవాళ విడుదలైన వీర ధీర శూర 2 ఉదయం షోలు రద్దవడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ B4U కోర్టులో వేసిన కేసు కారణంగా, చివరి నిమిషంలో ఈ ఆటంకం ఏర్పడింది. దీంతో, ఉదయం, మధ్యాహ్నం షోలు కోసం టికెట్లు బుక్ చేసుకున్న వారికి రీఫండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముంబై న్యాయస్థానం తీర్పు ప్రకారం, సుమారు 7 కోట్లు చెల్లిస్తే మాత్రమే విడుదలకు అనుమతి అని పేర్కొనడంతో సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. అయితే, ఎట్టకేలకు మధ్యాహ్నం 4 గంటల నుంచి క్రమంగా థియేటర్లలో ప్రదర్శనలు మొదలయ్యాయి. అయితే, ఈ ఆలస్య విడుదల కారణంగా ఓపెనింగ్స్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బుకింగ్ సిస్టమ్ హఠాత్తుగా అప్డేట్ చేయడంతో, అనేక మంది ప్రేక్షకులు సడెన్ ప్లానింగ్ చేసుకోలేక సినిమాను మిస్ అయ్యారు.
ఈ పరిస్థితుల్లో, హీరో విక్రమ్, ఎస్.జె. సూర్య తమ పారితోషికం తగ్గించుకుని నిర్మాతలకు సహాయపడేందుకు ముందుకు వచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై స్పష్టత రావాలంటే చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి అవాంతరాలు కొత్త కాదు. టాలీవుడ్లో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. సమస్యకు బాధ్యులెవరో నిర్ణయించడం కంటే, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ ఎదురుకాకుండా ప్రొడ్యూసర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అసలే L2: Empuraan వంటి భారీ సినిమా పోటీ ఉన్న నేపథ్యంలో వీర ధీర శూర 2 ఓపెనింగ్స్‌కు తగిన దెబ్బ తగిలింది. ఇప్పుడు పాజిటివ్ టాక్ వస్తేనే సినిమాకు ఊపొచ్చినట్లే. మరి రాత్రిలోగా రివ్యూలు, మౌత్-టాక్ ఎలా వస్తాయో చూడాలి!
Recent Random Post:















