శివాజీ విలన్ అవతారం – సెకండ్ ఇన్నింగ్స్‌కు శుభారంభం!

Share


ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ, మధ్యలో రాజకీయాలకు మొగ్గుచూపడంతో సినిమాలకు దూరమయ్యారు. కొంతకాలంగా పలువురు దర్శకులు అవకాశాలు ఇచ్చినా, ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే, 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఆయన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకువచ్చింది. మధ్య తరగతి తండ్రిగా అమాయకత్వం నిండిన పాత్రలో శివాజీ నటన ప్రేక్షకుల హృదయాలను మెలిపెట్టింది.

ఇప్పుడు, నాని నిర్మించిన కోర్ట్ సినిమాలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. నిన్న జరిగిన మీడియా ప్రీమియర్ తర్వాత సినిమా కంటే ఎక్కువగా “మంగపతి” క్యారెక్టర్ గురించే చర్చ సాగడం గమనార్హం. దర్శకుడు రామ్ జగదీశ్ ట్రైలర్ నుంచే ఈ పాత్రను రక్తికట్టేలా తీర్చిదిద్దారు. అసలు సినిమాలో అయితే పర్ఫెక్ట్ విలనిజంకు నిదర్శనంగా మంగపతి పాత్ర నిలిచిందనే చెప్పాలి.

పరువు కోసం ఏకగ్రీవంగా ఏమైనా చేసే మంగపతిగా శివాజీ నటన అద్భుతంగా పండింది. ముఖ్యంగా హర్షవర్ధన్‌తో వచ్చే సన్నివేశాలు తెరపై అదిరిపోయాయి. అతిగా ఆవేశపడే మంగపతిగా ఆయన చూపించిన ఇంటెన్సిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాతో టాలీవుడ్‌లో విలన్ల కొరతను భర్తీ చేసే మరో ప్రధాన నటుడిగా నిలవనున్నారు.

ఇంతకుముందు శ్రీకాంత్, జగపతిబాబు కూడా సెకండ్ ఇన్నింగ్స్‌ను విలన్ పాత్రలతో గ్రాండ్‌గా మొదలుపెట్టినట్లు, శివాజీ కూడా అదే దారిలో వెళ్తున్నారు. 1997లో చిరంజీవి మాస్టర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన, ఆ తర్వాత సోలో హీరోగా కొంత గుర్తింపు తెచ్చుకున్నా, విజయాలు తగ్గడంతో సపోర్టింగ్ రోల్స్‌కు మారిపోయారు. 2010 తర్వాత పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు.

ఇప్పుడు, 90s, కోర్ట్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ వెంచర్లతో మళ్లీ వెలుగులోకి వచ్చారు. ఇకపై యాక్టింగ్ కొనసాగిస్తానని చెబుతున్న శివాజీ, “నాని నన్ను విలన్‌గా ఫిట్ అవుతానని ఎలా నమ్మాడో ఆశ్చర్యం!” అని హాస్యంగా చెప్పినా, అదే ఇప్పుడు అతని కెరీర్‌లో బ్రేక్‌పాయింట్ కావొచ్చు.


Recent Random Post: