సూర్య–వివేక్ ఆత్రేయ కాంబోపై హాట్ బజ్

Share


ప్రస్తుతం ఇతర భాషల హీరోలందరూ తెలుగుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న తెలుగు సినీ పరిశ్రమలో భాగం కావాలని, తెలుగు డైరెక్టర్లతో కలిసి పనిచేయాలని అనేకమంది స్టార్‌లు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ హీరోలు ఈ విషయంలో ముందున్నారు.

ఇప్పటికే శివ్ కార్తికేయన్ — అనుదీప్ దర్శకత్వంలో ప్రిన్స్, దళపతి విజయ్ — వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు చేశారు. తర్వాత ధనుష్ — వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ చేశారు. ఇప్పుడు అదే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు.

వెంకీ అట్లూరి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సూర్య, మరో తెలుగు దర్శకుడితో కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్‌లో ప్రత్యేకమైన కథలతో గుర్తింపు పొందిన వివేక్ ఆత్రేయ, తన తదుపరి చిత్రాన్ని సూర్యతో చేయాలని భావిస్తున్నారట. బ్రోచేవారేవరురా, అంటే సుందరానికీ, సరిపోదా శనివారం వంటి భిన్న కథలను తెరకెక్కించిన ఆయన, ఇటీవల సూర్యను కలిసి కథను నేరేట్ చేసినట్టు తెలుస్తోంది.

సూర్యకు వివేక్ చెప్పిన స్టోరీ నచ్చిందని, ఈ టాలెంటెడ్ దర్శకుడితో పనిచేయడం పట్ల ఆసక్తి చూపించినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇంకా ఏదీ అధికారికంగా ఫైనల్ కాలేదు. సూర్య నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వివేక్ ఆత్రేయ ఎదురుచూస్తున్నారట.

అంతేకాక, గతంలో వివేక్ ఆత్రేయ రజినీకాంత్‌కు కూడా ఒక కథను నేరేట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు.

సూర్య విషయానికి వస్తే — ప్రస్తుతం వరుస పరాజయాలతో బాధపడి, వెంకీ అట్లూరి సినిమా ద్వారా తప్పకుండా హిట్ కొట్టి విజయపథంలో తిరిగి నడవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, మరో టాలీవుడ్ దర్శకుడికి అవకాశం ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.


Recent Random Post: