
స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘ఘాటి’ సినిమా భారీ అంచనాల మధ్య త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో జరిగిన ఓ నిజ ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అనుష్క ఓ బాధితురాలి నుంచి నేరస్తురాలిగా మారే శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మేజర్ భాగం ఆంధ్రా-ఒడిశా బోర్డర్ అటవీ ప్రాంతాల్లోనే చిత్రీకరించబడింది. సహజమైన ప్రదేశాల్లో షూటింగ్ చేయడం వల్ల సినిమాకు మరింత వాస్తవికత వచ్చిందని సమాచారం. ముఖ్యంగా అడవి నేపథ్యంలో సాగే యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ కానున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో స్వీటీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, రియల్ లొకేషన్స్‌లోనే స్టంట్స్ చేసి అదరగొట్టిందని టీమ్ చెబుతోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి ఏప్రిల్ 18న సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రచారాన్ని మరింత బలంగా చేయడానికి ఒకే ఒక్క ట్రైలర్ కాకుండా, రెండు ట్రైలర్లు విడుదల చేయనున్నారని సమాచారం. మొదటి ట్రైలర్ ఈ నెలాఖరున విడుదల చేయాలని, రెండో ట్రైలర్ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ నిర్ణయించిందట.
అయితే ఇప్పటి వరకు సినిమాకు సరైన ప్రమోషన్ జరగలేదు. పాటల విడుదల కూడా ఇప్పటికీ నిలిచిపోయింది. ఫిబ్రవరి ముగుస్తుండగా, మార్చి ప్రారంభం కావొస్తోంది. కానీ ఇంకా సినిమా చుట్టూ సరైన బజ్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పూర్తిస్థాయిలో ప్రమోషన్‌లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అనుష్కకు మంచి స్నేహితుడిగా, అలాగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ సంస్థతో అతనికి గట్టి అనుబంధం ఉండటంతో, ఆయన పూర్తి మద్దతు ఉండే అవకాశముందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
Recent Random Post:














