కర్ణాటక వివాదంతో తడిసిన ‘థగ్ లైఫ్’ వసూళ్లు

Share


విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన భారీ అంచనాల చిత్రంగా ‘థగ్ లైఫ్’ జూన్ 5న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ మొదటి షో నుంచే సినిమా మీద నెగటివ్ టాక్ నెలకొంది. మణిరత్నం ఈసారి కూడా తన పాత ఫార్ములాను మార్చుకోకుండా, రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాతో ప్రేక్షకుల నిరాశకు గురిచేశారు. ‘నాయకుడు’ తరహాలో మరో మైలురాయిగా నిలిచే చిత్రం వస్తుందని ప్రేక్షకులు ఆశించినా, తీరా తెరపై కనిపించింది మాత్రం ఓ సాధారణ కథా శైలీ.

అయితే వసూళ్ల పరంగా సినిమా మొదటి మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా ₹30 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. ఆదివారం కలెక్షన్లతో కలిపి నాలుగు రోజుల్లో ఈ సంఖ్య ₹40 కోట్లను దాటి పోయింది. గ్లోబల్ లెవెల్‌లో చూస్తే, నాలుగు రోజుల్లో సినిమా ₹73 కోట్ల వసూళ్లకే పరిమితమైంది. ఇదే కమల్ గత చిత్రం ‘ఇండియన్ 2’తో పోలిస్తే స్పష్టంగా తక్కువ. ‘ఇండియన్ 2’ బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించకపోయినా, నాలుగు రోజుల్లోనే ₹110 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఒక ముఖ్య కారణం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు—కర్ణాటకలో సినిమా విడుదల కాకపోవడం. కమల్ హాసన్ ఆ రాష్ట్ర భాషపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దాంతో కర్ణాటక ప్రభుత్వం థగ్ లైఫ్ సినిమాకు థియేట్రికల్ రిలీజ్ అనుమతిని నిరాకరించింది. ఆ రాష్ట్రంలో సినిమాకు మంచి క్రేజ్ ఉన్నా, ఈ వివాదం వల్ల ఆ మార్కెట్ పూర్తిగా కోల్పోయింది.

విశ్లేషకుల అంచనాల ప్రకారం, కర్ణాటక విడుదల లేకపోవడం వల్ల నిర్మాతలకు కనీసం ₹30 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. చాలా మంది ఈ వివాదం తరువాత కమల్ క్షమాపణ చెప్పాలన్నా, ఆయన మాత్రం తన మాట మీద నిలబడుతూ వెనక్కి తగ్గకపోవడమే తాజా పరిణామాలకు కారణమైంది.

ఇది కమల్ హాసన్ మరియు మణిరత్నం సంయుక్తంగా నిర్మించిన చిత్రం కావడంతో, దాని ప్రతిష్టాపన కూడా ఎక్కువగానే ఉంది. కానీ దురదృష్టవశాత్తు, సినిమా అనుకున్న స్థాయిలో కాకుండా విమర్శలపాలైంది.


Recent Random Post: