మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “థగ్ లైఫ్” జూన్ 5న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా ఈవెంట్‌లో కమల్ హాసన్‌తో పాటు శింబు, మణిరత్నం, త్రిష, అభిరామి, అశోక్ శెల్వన్, నాజర్, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ,
“తెలుగు ప్రేక్షకులు నాకు ఎంతో ప్రత్యేకం. నా మొదటి సినిమా ‘మన్మథ’కి ఇక్కడి నుంచి వచ్చిన స్పందన ఇంకా గుర్తుంది. ఇకపై గ్యాప్ లేకుండా తెలుగు సినిమాలు చేస్తాను. ‘ఓజి’లో పవన్ కళ్యాణ్ కోసం త్వరలోనే ఓ సాంగ్ విడుదలవుతుంది. థమన్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. పవన్‌గారికి పాట పాడటం నాకు గర్వంగా ఉంది” అన్నారు.
మరోవైపు మణిరత్నం గారు తాను కమల్ హాసన్‌తో కలసి చేసిన మొదటి చిత్రం “నాయకన్” గుర్తు చేసుకున్నారు.
“మౌనరాగం సినిమా పూర్తయ్యాక ఇంట్లో ఉన్న సమయంలో నిర్మాత ముక్త శ్రీనివాసన్ వచ్చి ఓ హిందీ సినిమా వీడియో క్యాసెట్ ఇచ్చారు. ఇది చూసి మీ అభిప్రాయం చెప్పమన్నారు. అయితే నేను హిందీ సినిమాకు సరిపోననే అనుమానంతో విస్మయించాను. అదే విషయాన్ని కమల్‌గారితో మాట్లాడమన్నా. తర్వాత కమల్‌తో మాట్లాడినప్పుడు ఆయన నన్ను ధైర్యపరిచారు. అలా ‘నాయకన్’ ప్రారంభమైంది. ‘థగ్ లైఫ్’ విషయంలోనూ అదే జరిగింది. ఓ రోజు కమల్ గారు ఫోన్ చేసి ‘మనం కలిసి సినిమా చేద్దాం’ అన్నారు” అని పేర్కొన్నారు.
కమల్ హాసన్ కూడా భావోద్వేగంగా స్పందించారు.
“నాయకన్ టైమ్‌లో మణిరత్నాన్ని కలవడం ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఈ మణిని కూడా అదే స్థాయిలో చూసేలా ఉంది. శింబు నాకు సినిమా బిడ్డలాంటి వాడు. అభిరామి మళ్లీ సినిమాల్లోకి వచ్చిందంటే నన్ను సంతోషపెడుతుంది” అన్నారు.
తాను పొందిన స్టార్‌డమ్ గురించి మాట్లాడుతూ,
“నిజాయితీగా చెప్పాలంటే ఆడియన్స్ ఇచ్చిన స్టార్‌డమ్ నాకొంత ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించింది” అని కమల్ హాసన్ చెప్పారు.
Recent Random Post: