నాగార్జున కోసం మొదలైన కథ వెంకటేష్ వద్ద ఆగింది!

Share


ఈ తరం మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ మొదలైంది 2013లో విడుదలైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతోనే. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఘన విజయాన్ని సాధించింది. తాజాగా, మార్చి 7న రీ-రిలీజ్ చేసిన ఈ చిత్రం మళ్లీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అందులో ముఖ్యంగా ఈ కథ మొదట నాగార్జున కోసం అనుకున్న విషయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

నాగార్జున కోసం మొదలైన కథ ఎలా వెంకటేష్ వద్దకి వెళ్లింది?
‘కొత్త బంగారు లోకం’ సినిమా విడుదలై విజయవంతమైన తర్వాత, శ్రీకాంత్ అడ్డాల సంక్రాంతి సెలవులకు ఊరికి వెళ్తుండగా ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఫోన్ చేసి నాగార్జున కోసం ఏదైనా కథ ఉందా? అని అడిగారట. ఒక్కసారిగా ఆ ఆఫర్ రావడంతో కాస్త టెన్షన్‌తో ఆలోచనకు గురయ్యానని శ్రీకాంత్ చెప్పారు. ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాగార్జునను కలసి, మల్టీస్టారర్ కథ ఉందని, ఇద్దరు హీరోలు ఉంటారని చెప్పారు. ఈ ఆఫర్‌పై నాగ్ ఆసక్తి చూపి, “చూద్దాం” అని స్పందించారు.

అయితే, మూడు రోజుల తర్వాత మార్తాండ్ వెంకటేష్ మళ్లీ ఫోన్ చేసి సురేష్ బాబు పిలుస్తున్నారు, వెంకటేష్‌తో సినిమా చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు అన్నారు. శ్రీకాంత్ అడ్డాల సురేష్ బాబు ఆఫీసుకు వెళ్లగా, అక్కడ వెంకటేష్ కూడా ఉన్నారు. కొత్త బంగారు లోకం సినిమాను ప్రశంసించిన సురేష్ బాబు, “ఏదైనా కథ ఉందా? చెప్పు, చేద్దాం” అని అడిగారట.

అప్పుడు శ్రీకాంత్ అన్నదమ్ముల కథను వెంకటేష్ ముందు ప్రస్తావించగా, ఆయనకు ఆ లైన్ బాగా నచ్చింది. దీంతో సురేష్ బాబు కథను డెవలప్ చేయమని సూచించారు. అయితే, శ్రీకాంత్ మాత్రం రెండో సినిమా దిల్ రాజు బ్యానర్‌కే చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దిల్ రాజు కూడా “ముందు కథ బాగా రెడీ చెయ్యి” అని చెప్పడంతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా వెంకటేష్, మహేష్ కాంబినేషన్‌లో సెట్స్ మీదకు వెళ్లింది.

ఈ విషయం బయటకు రాగానే, అక్కినేని అభిమానులు నాగార్జున మంచి కథను మిస్ అయ్యారని భావిస్తున్నారు. కానీ, ఈ కథ వెంకటేష్ – మహేష్ బాబు కాంబినేషన్‌లో తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్‌ను మరింత బలపరిచిన సినిమా అయింది.


Recent Random Post: