నార్నే నితిన్‌పై ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రశంసలు!

Share


యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిదిగా గుర్తింపు పొందిన నార్నే నితిన్, తొలి సినిమా మ్యాడ్తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో నలుగురిలో ఒకరిగా కీలక పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ కూడా విడుదలకు సిద్ధమైంది. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నార్నే నితిన్ తన బావ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. “నా తొలి సినిమా నుంచి ఎన్టీఆర్ అన్న నాకు సలహాలు ఇస్తూ ఉన్నారు. ఆయ‌న చెప్పిన ప్రతి మాటను మ‌న‌సులో పెట్టుకుని ముందుకెళ్తాను. భవిష్యత్‌లోనూ ఆయ‌న మార్గదర్శకత్వం తీసుకుంటాను. నా డెబ్యూ సినిమా విజయంపై ఎన్టీఆర్ అన్న చాలా ఆనందించారు. ‘మొదటి సినిమాతో హిట్ కొట్టడం అంత ఈజీ కాదు, కానీ నువ్వు సాధించావు. కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకో’ అని సూచించారు. ఆయన నుంచి అందుకున్న ఆ కాంప్లిమెంట్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది” అని నితిన్ చెప్పాడు.

సినిమాలో మరో ప్రధాన పాత్ర పోషించిన సంగీత్ శోభన్ కూడా తన అనుభవాన్ని పంచుకున్నాడు. “మ్యాడ్ రిలీజ్ తర్వాత నా స్నేహితుడితో కలిసి ఓ ఈవెంట్‌కు వెళ్లాను. అక్కడ రామ్ చరణ్ గారు కూడా హాజరయ్యారు. నా ఆశ్చర్యానికి, ఆయ‌న నన్ను చూసి వెంటనే గుర్తుపట్టారు. ‘మ్యాడ్ లో ముగ్గురూ బాగా చేశారూ’ అని ప్రశంసించారు. అంతటి పెద్ద స్టార్ నన్ను గుర్తు పెట్టుకోవడం నాకు చాలా గొప్ప అనుభూతి ఇచ్చింది. సాధారణంగా పెద్దవాళ్లు పేర్లు మర్చిపోతారు, కానీ రామ్ చరణ్ గారు నన్ను గుర్తుపట్టడం నిజంగా సర్‌ప్రైజింగ్!” అని సంగీత్ భావోద్వేగంగా వెల్లడించాడు.

ఇంట్లో తన తండ్రి తనపై చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని నార్నే నితిన్ వెల్లడించాడు. “ఏదైనా బాగోలేదనిపిస్తే ముఖం మీదే చెప్పేస్తారు. నన్ను గ్రౌండెడ్‌గా ఉంచేది కూడా ఆయనే. ‘మ్యాడ్’ చూసిన తర్వాత, ‘పర్వాలేదు రా, బాగా ఇంప్రూవ్ అయ్యావు. వెబ్ సిరీస్‌ల్లో అంతగా మెప్పించలేకపోయావు, కానీ సినిమాలో బాగా చేశావు’ అని ప్రశంసించారు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని, కాన్ఫిడెంట్‌గా ఉన్నావని చెప్పారు. ఇంకా మంచి స్థాయికి వెళ్లాలని ఆశీర్వదించారు. ఇది నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది” అని చెప్పాడు.

మ్యాడ్ స్క్వేర్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో నార్నే నితిన్ మరో హిట్ అందుకుంటాడా? అనేది చూడాలి!


Recent Random Post: