మహేష్ బాబుతో ఛత్రపతి శివాజీ బయోపిక్ – ఫ్యాన్స్ కల నెరవేరుతుందా?

Share


సూపర్ స్టార్ కృష్ణ గారు తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా, పూర్తి చేయలేకపోయిన ఓ డ్రీం ప్రాజెక్ట్ ఉంది – ఛత్రపతి శివాజీ. మరాఠా యోధుడి వీరగాథను గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కించాలని ఆయన ఎన్నోసార్లు అనుకున్నా, అనేక కారణాల వల్ల ఆ కల నిజం కాలేదు. సింహాసనం భారీ హిట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టినా, అప్పటి పరిస్థితులు, కమర్షియల్ లెక్కలు, మారిన ట్రెండ్స్ కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ఎన్టీఆర్ లాంటి మహానటుడే శివాజీ పాత్రను చేయలేకపోయిన వేళ, కృష్ణగారు నెంబర్ వన్, చంద్రహాస్ చిత్రాల్లో ఆ గెటప్ వేసుకుని కొంతంతైనా తన తపనను తీర్చుకున్నారు.

ఇప్పుడు ‘చావా’ సినిమాతో మరాఠా వీరుల కథలకు ఎంత పెద్ద స్పాన్ ఉందో ఇండస్ట్రీకి అర్థమైపోయింది. ఇప్పటికే ‘తానాజీ’తో అజయ్ దేవగన్ ఒక స్థాయి పెంచగా, ఇప్పుడు విక్కీ కౌశల్ మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఓ టియర్-2 హీరోకే ప్రేక్షకులు ఈ స్థాయిలో బ్రహ్మరథం పడుతుంటే, ఒక స్టార్ హీరో చేస్తే ఆ సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ గారి కలను మహేష్ బాబు నెరవేర్చితే ఎంత బాగుంటుందనే అభిప్రాయం అభిమానులలో వ్యక్తమవుతోంది.

ఎస్ఎస్ఎంబి 29 తర్వాత రాజమౌళితో సినిమా చేయబోయే మహేష్ బాబు, దేశవ్యాప్తంగా మరింత పెరిగిన మార్కెట్‌తో, భాష భేదం లేకుండా పాన్-ఇండియా స్టార్‌గా ఎదుగుతాడు. అలాంటి టైంలో ఒక శివాజీ బయోపిక్‌ను సరైన దర్శకుడితో చేయగలిగితే అది రికార్డుల మోత మోగించటం ఖాయం. ప్రస్తుతం బాలీవుడ్‌లో శంభాజీ మహారాజ్, ఇతర యోధుల కథలను తెరకెక్కించే పనిలో నిర్మాతలు, దర్శకులు బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఉత్తరాదిలో శివాజీ సెంటిమెంట్ బాగా పెరిగిన ఈ పరిస్థితుల్లో, మహేష్ బాబు ఛత్రపతి శివాజీగా నటించే రోజు రాగలదా? అంటే అభిమానులు మాత్రం దానికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!


Recent Random Post: