ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన సమంత ఇటీవల సినిమాల నుంచి కాస్త దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా స్టార్ హీరోలతో చిత్రాల్లో నటించిన సమంత, గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలు తగ్గించారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె, చికిత్స కోసం సుమారు ఏడాది పాటు పూర్తి బ్రేక్ తీసుకున్నారు.
ఆ బ్రేక్ తర్వాత తిరిగి వచ్చినా సమంత పూర్తిస్థాయిలో సినిమాలు చేయడం లేదు. తక్కువ సినిమాలే చేస్తూ, వాటినీ ఎంతో సెలెక్టివ్‌గా ఎంచుకుంటున్నారు. అంతేకాక, బాలీవుడ్ ప్రాజెక్టులపైనా దృష్టి పెట్టారు. ఇటీవల నిర్మాతగానూ మారి, ‘శుభం’ అనే సినిమాను నిర్మించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన ఆరోగ్యంపై స్పందించారు. “మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోలేకపోయినా, గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్‌గా ఉన్నాను. ఆ సమస్య తలెత్తినప్పుడు ముందుగానే జాగ్రత్తపడాల్సింది. కానీ అప్పటి పరిస్థితులు అనుకూలంగా లేకపోయాయి. ఇప్పుడు మాత్రం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే దమ్ము ఉంది,” అని చెప్పారు.
అలాగే ఇటీవల తాను సినిమాలు తగ్గించిన విషయాన్ని సమంత ఓపికగా అంగీకరించారు. “ఎక్కువ సినిమాలు చేయాలనే రేసులో నుంచి నేను నా దృష్టిని తొలగించుకున్నాను. ఇకపై కంటెంట్‌కు ప్రాధాన్యమిస్తూ మంచి అభిరుచి ఉన్న సినిమాలు మాత్రమే చేస్తాను,” అని చెప్పారు. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయని, వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే వస్తాయని సమంత హింట్ ఇచ్చారు.
Recent Random Post: