సెలబ్రిటీ దంపతులైనప్పుడు ఇంట్లో సినిమా చర్చలు ఎప్పుడూ సాగుతాయనే అనుకోవడం సహజమే. హీరో, హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుని, పిల్లల్ని పెంచుకుంటే, వారి చిన్ననాటి నుంచి ఇంట్లో సినిమా వాతావరణం అలవాటుగా మారిపోతుంది. అయితే ఇద్దరు నటులే అయినప్పటికీ, ఇంట్లో కూడా సినిమానే ప్రాధాన్యత కలిగి ఉంటుందా? అన్నదానికి సూర్య-జ్యోతిక దంపతులు భిన్నమైన సమాధానం చెబుతున్నారు.
సూర్య-జ్యోతిక తమ కుటుంబ జీవితాన్ని పూర్తిగా సినిమా ప్రపంచం నుండి వేరుగా ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలియజేశారు. షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే తాము నటులమనే విషయాన్ని మరచిపోయి, ఒక సాధారణ భార్యాభర్తలా గడుపుతామని చెప్పారు. ఇంట్లో సినిమా గురించి చర్చించకుండా ఉండేలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటారని, ముఖ్యంగా పిల్లల ఎదుగుదలలో సినిమాల ప్రభావం లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
జ్యోతిక పూర్తిగా ఓ సాధారణ గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ, పిల్లల పనులను దగ్గరుండి చూసుకుంటుంది. ఉదయం టిఫిన్ బాక్స్ నుంచి మధ్యాహ్న భోజనం వరకూ పిల్లల అవసరాలన్నింటినీ స్వయంగా చూసుకుంటుందట. సూర్య కూడా తండ్రిగా పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, పిల్లలపై మంచి ప్రభావం ఉండేలా చూస్తున్నాడని చెప్పారు. ఇంట్లో సినిమాల గురించి టాపిక్ చాలా తక్కువగా వస్తుందని, ప్రస్తుతానికి పిల్లలిద్దరినీ చదువుపైనే దృష్టిపెట్టమని వారిద్దరూ నిరంతరం చెబుతున్నారని తెలిపారు.
పిల్లలు సినిమాల వైపు ఆకర్షితులవ్వడం సహజమే కానీ, వారిని గమనించి, అందుకు దూరంగా పెంచేందుకు తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అందుకే వారి చదువుల కోసం చెన్నై నుంచి ముంబైకి మారాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం జ్యోతిక ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తోంది. చెన్నైలో ఉన్నప్పుడు పూర్తిగా కోలీవుడ్ సినిమాలపైనే దృష్టి పెట్టిన ఆమె, ఇప్పుడు ముంబైకి వెళ్లాక బాలీవుడ్ అవకాశాలపైనే ఫోకస్ పెట్టింది. అయితే, కుటుంబానికి, పిల్లల భవిష్యత్తుకి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్న తాము, సినీ వాతావరణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా చూసుకుంటున్నామని సూర్య-జ్యోతిక చెప్పుకొచ్చారు.
Recent Random Post: