ఉస్తాద్ భగత్ సింగ్‌పై పరుచూరి విశ్లేషణ

Share


‘గబ్బర్ సింగ్’తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ ఒకప్పుడు బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ తాజాగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఆ స్థాయిని అందుకోలేక, బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిందని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. విడుదలకు ముందు నుంచే ఉన్న అనుమానాలు నిజమయ్యాయని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాపై లెజెండరీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన ‘పరుచూరి పలుకులు’ యూట్యూబ్ ఛానల్‌లో విశ్లేషణ చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ సినిమాకు పెట్టిన టైటిల్ పెద్ద మైనస్‌గా మారింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే పేరు శక్తివంతంగా ఉన్నప్పటికీ, భగత్ సింగ్ అంటే స్వాతంత్ర్య పోరాటం, త్యాగం వంటి భావాలు గుర్తుకు వస్తాయని, కానీ సినిమాలో చూపించిన హీరో పాత్ర ఆ భావానికి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. నిజానికి ఇది రౌడీ ఇన్‌స్పెక్టర్ తరహా పాత్రకు దగ్గరగా ఉందని, అలాంటి టోన్‌కు సరిపోయే టైటిల్ పెట్టి ఉంటే బాగుండేదని సూచించారు.

తమ రచనలో వచ్చిన నిప్పురవ్వ సినిమాలో జరిగిన తప్పే ఇక్కడ కూడా రిపీట్ అయిందని పరుచూరి పేర్కొన్నారు. ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్ ఎక్కువగా ఉండగా, సెకండ్ హాఫ్‌లో లవ్ స్టోరీకి ప్రాధాన్యం ఇచ్చామని, అది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని చెప్పారు. అదే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్ ఎక్కువగా ఉండి, లవ్ స్టోరీని సెకండ్ హాఫ్‌లో పెట్టడం మైనస్ అయ్యిందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రేమకథను ఫస్ట్ హాఫ్‌లోనే తీసుకొచ్చి ఉంటే బాగుండేదని సూచించారు.

అలాగే హీరో ఎంట్రీ దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా ఉండటం కూడా పెద్ద లోపమని, స్టార్ హీరో సినిమాల్లో ఇలాంటి ఆలస్యం ప్రేక్షకులను ఆకట్టుకోదని ఆయన అన్నారు. చిన్నప్పటి ఎపిసోడ్‌ను కుదించి, హీరోను ముందుగానే పరిచయం చేసి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేదని చెప్పారు.

పోలీసు అధికారి అయిన హీరో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని అత్యధిక హింసాత్మకంగా ప్రవర్తించడం కూడా సరైన ఎగ్జిక్యూషన్ కాదని పరుచూరి అభిప్రాయపడ్డారు. అయితే హరీష్ శంకర్ కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్ బాగా తీర్చిదిద్దారని ఆయన ప్రశంసించారు. కానీ కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా మంచి ఫలితాన్ని సాధించేదని ఆయన విశ్లేషించారు.


Recent Random Post: