
తెలుగు సినీ చరిత్రలో దిగ్గజ నటులు ఎన్.టి.ఆర్ మరియు కృష్ణ మధ్య విబేధాలున్న మాట వాస్తవం. కొన్ని కారణాల వల్ల ఇద్దరికి అప్పట్లో మనస్పర్దలు తలెత్తాయి. మరి అలాంటి మనస్పర్దలు అక్కినేని నాగేశ్వరరావు మరియు సూపర్‌స్టార్ కృష్ణ మధ్య కూడా ఉన్నాయా? అందుకు ఆజ్యం ఇచ్చింది దేవదాసు చిత్రం, అంటే అవునని తెలుస్తోంది.
సీనియర్ నటుడు నారాయణరావు ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరి మధ్య తలెత్తిన తీవ్ర విభేదాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇది కేవలం వృత్తిపరమైన పోటీ కాదు, ఆత్మగౌరవ పోరాటం కూడా అన్నమాట.
వివరాల్లోకి వెళ్తే, అక్కినేని గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు. దాదాపు ఏడాది విశ్రాంతి తీసుకునే సమయంలో టాలీవుడ్‌లో ఏఎన్నార్ ప్రభావం తగ్గుతుందన్న ఊహలు మొదలయ్యాయి. అదే సమయంలో కృష్ణ దేవదాసు సినిమాను రంగుల్లో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కినేని అమెరికాలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ ప్రారంభమై, నిజానికి ఈ గొడవకు కేంద్రబిందువు శ్రీ ఫిలిమ్స్ పంపిణీ సంస్థ.
ఏఎన్నార్ సినిమాలను అత్యధికంగా పంపిణీ చేసే ఈ సంస్థ, అక్కినేనికి అత్యంత సన్నిహితమైనదే. అయితే ఏఎన్నార్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండా కృష్ణ తమ చిత్రానికి పంపిణీ హక్కులను తీసుకోవడం అక్కినేనిని తీవ్రంగా కలచివేసింది. తన మనుషులే శత్రువులతో చేతులు కలిపారని భావించి ఆయనలో తీవ్ర ఆగ్రహం పెరిగింది.
అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏఎన్నార్ ఈ విషయాన్ని సవాలుగా తీసుకున్నారు. కృష్ణ దేవదాసు విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో, ఏఎన్నార్ తన పాత బ్లాక్ & వైట్ దేవదాసు నెగటివ్ హక్కులను స్వయంగా కొనుగోలు చేసి, మళ్ళీ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త చిత్రం పోటీగా తన పాత క్లాసిక్‌ని నిలబెట్టి తన సత్తా చూపించాలనుకున్నారు.
ఈ పోటీ ఫలితం ఇండస్ట్రీని షేక్ చేసింది. కృష్ణ నటించిన కలర్ దేవదాసు భారీ అంచనాలతో విడుదల అయినప్పటికీ, ప్రేక్షకులు ఏఎన్నార్ పాత దేవదాసునే చూసారు. పాత సినిమాను రెండోసారి థియేటర్ల్లో చూడటానికి జనం పోటెత్తారు. ఫలితంగా కృష్ణ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది, కానీ ఏఎన్నార్ పాత చిత్రం రీ-రిలీజ్ ఘనవిజయం సాధించింది.
తరువాత, ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం మళ్లీ స్టార్ల మధ్య కనిపించలేదు. రిలీజ్ సమయంలో పోటీ ఉండేది, కానీ రహస్యమైన పోటీ మాత్రం ఇక చోటు చేసుకోలేదు.
Recent Random Post:















