
వ్యక్తిగత జీవితంలో తరచుగా వివాదాలు, మనస్పర్థలతో వార్తల్లో నిలుస్తున్న మంచు సోదరులు – విష్ణు, మనోజ్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కూడా పోటీకి సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఏప్రిల్ 25న మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన కన్నప్ప పాన్-ఇండియా స్థాయిలో భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి, త్వరలోనే గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కి ప్రభాస్ సహా మొత్తం క్యాస్ట్ హాజరయ్యేలా విష్ణు పకడ్బందీగా ప్లాన్ చేస్తుండగా, వేడుకను శ్రీకాళహస్తిలో నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై తుది నిర్ణయం త్వరలోనే వెలువడనుంది. మొత్తానికి రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు.
ఇదిలా ఉంటే, మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన భైరవం కూడా అదే ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం అసలు జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తమిళ సూపర్ హిట్ గరుడన్ రీమేక్‌గా రూపొందింది. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషించగా, దర్శకుడు శంకర్ కూతురు అదితి టాలీవుడ్లో ఈ సినిమాతో స్ట్రైట్ డెబ్యూ చేయనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి ఆదరణ పొందాయి.
ఇప్పటివరకు అధికారికంగా ఏ ప్రకటన వెలువడకపోయినా, కన్నప్ప vs భైరవం పోటీ ఆసక్తికరంగా మారనుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కన్నప్ప భారీ క్యాస్టింగ్‌కి తట్టుకుని భైరవం నిలదొక్కుకుంటుందా అనేదే ఆసక్తికర ప్రశ్న. మేకర్స్ మాత్రం భైరవం చిత్రంపై గట్టిగా నమ్మకంతో ఉన్నారు. క్లాస్, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని, ఒరిజినల్ వెర్షన్లో మిస్సయిన కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించామని చెబుతున్నారు.
మరోవైపు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు వంటి భారీ తారాగణంతో కన్నప్ప హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. చివరికి అన్నదమ్ములు నిజంగానే బాక్సాఫీస్ పోరుకు దిగుతారా? లేదంటే సినిమాల మధ్య మైత్రి ఒప్పందం జరుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Recent Random Post:














