
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ప్రతి కొత్త దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం ఓ చిరస్మరణీయ కల. ఒక తరాన్ని ప్రభావితం చేసి, యావత్ సినీ ప్రేపంచానికి స్ఫూర్తినిచ్చిన చిరంజీవి, తనపై అభిమానం కలిగిన యువ దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ముందుంటారు. బాబీ తన కలను నెరవేర్చుకున్నాడు. తాజాగా అనిల్ రావిపూడి చిరుతో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. అయితే, బాబీతో పాటుగా చిరు నుంచి పిలుపు అందుకున్న మరో యువ దర్శకుడు వెంకీ కుడుముల.
‘ఛలో’, ‘భీష్మ’ లాంటి హిట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న వెంకీకి మెగాస్టార్ కోసం ఓ సినిమా చేసే అవకాశం లభించింది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని అధికారికంగా ప్రకటించారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ముందుకు సాగలేదు. ఈ విషయంపై తాజాగా స్పందించిన వెంకీ – ‘‘భీష్మ తర్వాత చిరంజీవి గారికోసం ఒక కథ రాశాను. ప్రాథమికంగా ఆ ఐడియా ఆయనకు నచ్చింది. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకుని రావాలని చెప్పారు. చిరంజీవి గారితో చేసే సినిమా అద్భుతంగా ఉండాలనే ఉద్దేశంతో మరింత మెరుగులు దిద్దుతూ ఎక్కువ సమయం తీసుకున్నాను. కానీ చివరికి అది ఆయనకు పూర్తిగా సంతృప్తినివ్వలేదు. మరో కథ సిద్ధం చేసుకుని రావాలని నిర్ణయించుకున్నా.
ఈ గ్యాప్‌లో నితిన్ అన్నను కలిశాను. నా దగ్గర ఉన్న ఓ కథా ఐడియాను చెబితే ఆయన ఆసక్తి చూపించారు. ఆ కథను నితిన్ గారి స్టైల్‌కు తగ్గట్లుగా అభివృద్ధి చేసి ‘రాబిన్ హుడ్’గా రూపొందించాను. చిరంజీవి గారితో చేయాల్సిన సినిమా ఒక్కసారి చేజారిపోయినప్పటికీ, భవిష్యత్తులో ఆయనతో ఓ అద్భుతమైన ప్రాజెక్ట్ చేయాలనే ఆశతో ముందుకు సాగుతున్నా’’ అని వెంకీ కుడుముల పేర్కొన్నాడు.
Recent Random Post:















