
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకడైన శ్రీకాంత్ సినీ వారసత్వాన్ని అందుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యువ నటుడు రోషన్ మేక. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ‘రుద్రమదేవి’ సినిమాలో బాల నటుడిగా కనిపించాడు. ఆ తర్వాత టీనేజ్ దశలో ‘నిర్మలా కాన్వెంట్’తో హీరోగా ప్రయత్నం చేశాడు. జెన్-జి భాషలో చెప్పాలంటే అది ఓ నిబ్బా–నిబ్బీ ప్రేమకథ. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాలేదు.
తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రోషన్, ‘పెళ్ళిసంద-డి’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ మారుతున్న కాలానికి తగ్గ కథనాలు, ట్రీట్మెంట్కు దూరంగా ఉన్న రాఘవేంద్రరావు పర్యవేక్షణలో, ఒక లేడీ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. అయినప్పటికీ రోషన్–శ్రీలీల జంట అందం, అభినయం ఆకట్టుకోవడం, పాటలు బాగుండడంతో సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఈ సినిమాతో హీరో, హీరోయిన్ ఇద్దరికీ అవకాశాలు వచ్చాయి.
శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోగా, రోషన్ మాత్రం ఆచితూచి అడుగులు వేశాడు. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిదే కానీ, అతని కెరీర్లో ఈ గ్యాప్ మరీ ఎక్కువగా మారింది. ఫలితంగా ప్రేక్షకుల్లో అతని గుర్తింపు క్రమంగా తగ్గిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో రోషన్ ‘ఛాంపియన్’ రూపంలో ఒక మంచి కథను ఎంచుకున్నాడు. కానీ కెరీర్ ఆరంభ దశలో ఉన్న హీరోకి ఆ సినిమా మోయలేని భారంగా మారింది. కథ మరీ సీరియస్‌గా ఉండటం, కమర్షియల్ ఎలిమెంట్స్ లోపించడం సినిమాకు మైనస్ అయ్యాయి. ‘ఛాంపియన్’ను చెడ్డ సినిమా అని అనలేం గానీ, రోషన్ కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాక, స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఇలాంటి కథను ఎంచుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేది.
తొలి వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘ఛాంపియన్’ ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం, ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో ఈ సినిమాను బాక్సాఫీస్ పరంగా డిజాస్టర్‌గా చెప్పాల్సిందే. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత చేసిన సినిమానే ఇలా ఫలించకపోతే, రోషన్ కెరీర్‌పై దాని ప్రభావం తప్పకుండా పడుతుంది.
ఇప్పటివరకు చూస్తే రోషన్ కథల ఎంపికలో స్పష్టమైన తప్పిదాలు ఉన్నాయన్నది అర్థమవుతుంది. ఇకనైనా సరైన స్టోరీలు ఎంచుకుని, ఎక్కువ ఆలస్యం చేయకుండా సినిమాలు పూర్తి చేసి, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తేనే అతని కెరీర్‌కు కొత్త ఊపిరి వస్తుంది.
Recent Random Post:















