
టాలీవుడ్‌లో నిర్మాతల బడ్జెట్‌ను కాపాడే దర్శకుడిగా మారుతికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రేమకథా చిత్రం, మంచి రోజులొచ్చాయి లాంటి సినిమాలను తక్కువ ఖర్చుతో, పరిమిత లొకేషన్లలో, వేగంగా పూర్తి చేసిన దర్శకుడిగా ఆయన పేరు నిలిచిపోయింది. అనవసర ఖర్చులకు అస్సలు ఆస్కారం ఇవ్వని మేకింగ్ స్టైల్ మారుతి ప్రత్యేకత.
అయితే అదే మారుతి తెరకెక్కించిన ది రాజా సాబ్ విషయంలో మాత్రం సుమారు రూ.50 కోట్ల విలువైన గంట నిడివి ఫుటేజ్ వృథా అయిందన్న వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఇలాంటి అంశాలు మరింతగా హైలైట్ అవుతున్నాయి.
సాధారణంగా బడ్జెట్ విషయంలో మారుతి చాలా కచ్చితంగా వ్యవహరిస్తారు. నిర్మాతకు ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేయడంలో ఆయన ముందుంటారు. కానీ రాజా సాబ్ ఒక సాధారణ సినిమా కాదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో చేసిన భారీ ప్రాజెక్ట్ కావడంతో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథలో మధ్యలో జరిగిన మార్పులు, గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం కారణంగా షూటింగ్ అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు సాగినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీనివల్ల మారుతి తన రెగ్యులర్ స్పీడ్, కంట్రోల్‌ను పూర్తిగా మెయింటైన్ చేయలేకపోయారని అర్థమవుతోంది.
సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కథకు పెద్దగా అవసరం లేని కొన్ని సీన్స్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదన్న అభిప్రాయాలు వినిపించాయి. చివరకు సుమారు గంట నిడివి ఫుటేజ్‌ను ఎడిటింగ్‌లో తొలగించాల్సి రావడం మారుతి లాంటి దర్శకుడికి ఇష్టమైన విషయం కాదనే చెప్పాలి. అయితే ప్రభాస్ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయాలనే ప్రయత్నంలో కొన్ని సీన్స్ షూట్ చేసి, అవి కథకు సరిపోకపోవడంతో పక్కన పెట్టాల్సి వచ్చిందన్న టాక్ ఉంది. మొదట పార్ట్ 2 కోసం వాడాలన్న ఆలోచన ఉన్నా, సినిమా ఫలితం దృష్ట్యా మళ్లీ రిస్క్ చేయకపోవచ్చని భావిస్తున్నారు.
మొత్తానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో మారుతి కూడా చేయగలిగింది తక్కువేనని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. భారీ సినిమాల్లో గ్రాఫిక్స్ ఆలస్యం అయితే ఆటోమేటిక్‌గా వడ్డీలు, కాల్షీట్లు, ఇతర ఖర్చులు పెరుగుతాయి. ఎప్పుడూ నిర్మాతలకు మేలు చేయాలనే ఆలోచించే మారుతి, రాజా సాబ్ విషయంలో మాత్రం మారిన సమీకరణాల వల్ల కంట్రోల్ కోల్పోయినట్లుగా కనిపిస్తోంది.
ట్రేడ్ వర్గాల ప్రకారం, థియేట్రికల్‌గా 45 శాతం పైగా నష్టాలు రావడం కలవరపెడుతున్న అంశం. పొదుపు తెలిసిన దర్శకుడి సినిమానే ఇంత వృథా కావడం వెనుక వ్యక్తిగత తప్పుల కంటే పరిస్థితుల ప్రభావమే ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుని, మారుతి తన తదుపరి ప్రాజెక్ట్‌ను తన పాత స్టైల్ పక్కా ప్లానింగ్‌తో మళ్లీ పట్టాలెక్కిస్తారో లేదో చూడాలి.
Recent Random Post:















