
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ భవిష్యత్‌లో సినిమాలు చేస్తారా లేదా అన్నదానిపై అభిమానుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. రాజకీయ సేవ, ప్రజా సంక్షేమమే తన ప్రాధాన్యతలు అని పవన్ ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సహా పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. సభలో అభిమానులు “ఓజి.. ఓజి..” అంటూ నినాదాలు చేయగా, వారిని నియంత్రించి, పార్టీకే గౌరవం ఇవ్వాలనే ఆయన తీరు చూస్తే ఇక సినిమాలకు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. నిరంతర రాజకీయ ప్రచారాలు, ప్రభుత్వ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు—ఇవి అన్నీ కలిసి ఆయన సినిమాలపై ఆసక్తి తగ్గిస్తున్నాయనే అనిపిస్తోంది. ఇటీవల తన రెండో కొడుకునే ఎత్తుకోలేనంత బలహీనంగా మారానని, మీ మద్దతుతో ముందుకు సాగుతానని చెప్పిన పవన్ వ్యాఖ్యలు అభిమానులను ఆలోచనలో పడేశాయి.
ఇదిలా ఉంటే, హరిహర వీరమల్లు విడుదల అనంతరం ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఏడాది ఓజి సినిమాతో పవన్ సినీ ప్రయాణానికి ముగింపు పలికే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్‌లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గతంలో అనుకున్న సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ కూడా కాదనుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
దీంతో అభిమానులకు పవన్ కళ్యాణ్ నుంచి మరో రెండు సినిమాలే మిగిలినట్టే. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రారంభమైనా, పూర్తవుతుందా అనే అనుమానం ఉంది. హరిహర వీరమల్లు రెండు భాగాలు, ఓజితో ఫ్యాన్స్ కొంతమేరకు సంతృప్తి పడాల్సిన పరిస్థితి. గతంలో అజ్ఞాతవాసి సినిమా తరువాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించిన పవన్, ఆ తర్వాత పరిస్థితుల కారణంగా మళ్లీ సినిమాల్లోకి రాగా, ఇప్పుడు నిజంగానే సినిమాలకు వీడ్కోలు చెప్పే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇదంతా దృష్టిలో పెట్టుకొని పవన్ తనయుడు అకీరా నందన్ను వచ్చే రెండు సంవత్సరాల్లో టాలీవుడ్‌లో లాంచ్ చేసే ప్రణాళికలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Recent Random Post:















