
కింది స్థాయి నుంచి పైకి ఎదిగినవాళ్లలో ఒక ప్రత్యేకమైన కసి ఉంటుంది. అలాంటి కసి, పట్టుదల ఉన్న ప్రతిభావంతుడే దర్శకుడు మారుతి. అందుకే అంచెలంచెలుగా ఎదుగుతూ, ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి చేరుకున్నాడు. కేవలం 11 సినిమాల కెరీర్లోనే ప్రభాస్‌తో సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు.
మారుతి కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన ది రాజా సాబ్ 2026 సంక్రాంతి బరిలోకి వస్తుండటంతో ఆయన ఎంతో ఎమోషనల్‌గా, అదే సమయంలో ఎగ్జైటింగ్‌గా ఉన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మారుతి తన భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అదే వేదికపై మారుతి గురించి మాట్లాడుతూ మరో వ్యక్తి కూడా ఎమోషనల్ అయ్యారు. ఆయన యువ నిర్మాత ఎస్కేఎన్. ఒక్కో మెట్టు ఎక్కుతూ, తనదైన బలమైన భావజాలాన్ని ధైర్యంగా వ్యక్తం చేస్తూ వస్తున్న నిర్మాతగా ఎస్కేఎన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మారుతి దర్శకుడు కాకముందు నుంచే తమిద్దరి మధ్య స్నేహం ఉందని ఆయన వెల్లడించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆ స్నేహ ప్రయాణాన్ని ది రాజా సాబ్ వేదికపై ఎస్కేఎన్ గుర్తు చేసుకున్నారు.
తండ్రి అరటిపళ్ల బండి నడిపే కుటుంబం నుంచి మారుతి ఈ స్థాయికి ఎదగడాన్ని తాను కళ్లారా చూసినట్లు చెప్పారు. ఆ సందర్భంలో ఎస్కేఎన్ చాలా భావోద్వేగంగా మాట్లాడారు. రూ.20 ఫుల్ మీల్స్ కోసం తలో ఎనిమిది రూపాయలు వేసుకుని, మిగిలిన డబ్బు కోసం మూడో వ్యక్తిని వెతికిన రోజులను గుర్తు చేసుకున్నారు. చాలా కింది స్థాయి నుంచి ఇద్దరూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడికి వచ్చారన్నది ఈ మాటల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది.
రంగుల మాయా ప్రపంచంలో ఒకరు దర్శకుడిగా, మరొకరు నిర్మాతగా ఎదగడం అంత సులువు కాదు. కానీ ఇద్దరూ సాధించి చూపించారు. ప్రస్తుతం ఎస్కేఎన్ తెలుగు, తమిళం సహా పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తున్నానని కూడా ఈ వేదికపై వెల్లడించారు.
ఒక ఫుట్‌పాత్‌పై అరటిపళ్ల బండి నడిపే సాధారణ వ్యాపారి కుమారుడు ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్‌ను డైరెక్ట్ చేయడం నిజంగా అసాధారణమైన ప్రయాణం. మారుతి ఎదుగుదలని ఇండస్ట్రీ మొత్తం ప్రశంసిస్తోంది. ఆయన మొదట యానిమేషన్ రంగంలో నైపుణ్యం సంపాదించారు. గత ఇంటర్వ్యూల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కూడా యానిమేషన్లో శిక్షణ ఇచ్చానని మారుతి వెల్లడించారు.
ఈరోజుల్లో లాంటి చిన్న సినిమాకు స్నేహితులతో కలిసి రూ.10 లక్షలు అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టిన రోజులను మారుతి ఎప్పటికీ మర్చిపోలేదు. తాజా ఈవెంట్లో ఆయన ముఖంలో కనిపించిన భావోద్వేగాలు ఆ ప్రయాణానికి నిదర్శనంగా నిలిచాయి.
ది రాజా సాబ్ వేదికపై ఎస్కేఎన్ మాట్లాడుతూ మరో ఆసక్తికర విషయం వెల్లడించారు.
నాలుగేళ్ల క్రితం రాజా సాబ్ సినిమా సన్నాహాలు మొదలయ్యాయి. ఆ సమయంలో మారుతి తీసిన ఒక సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. అప్పుడు మారుతి ప్రభాస్ గారి ఇంటికి వెళ్లారు. నేను కార్లో గంటల పాటు వేచి చూశాను. బయటకు వచ్చిన తర్వాత మారుతి నాతో చెప్పింది ఒక్కటే – ఇక నా కెరీర్లో రెండుమూడేళ్లు నా ఆలోచనల్లో ఒక్క రాజా సాబ్ మాత్రమే ఉంటుంది అని. ఏం జరిగింది డార్లింగ్? అని అడిగితే, సినిమా ఫ్లాప్ అయితే అందులో నీ తప్పేముంది? మనం సినిమా చేస్తున్నామని ప్రభాస్ గారు చెప్పారు అని మారుతి చెప్పారు. ప్రభాస్ ఒట్టేసి మాట ఇవ్వకుండా మాట చెప్పరు. ఇచ్చిన మాటకు కట్టుబడి సినిమా చేశారు అని చెప్పారు.
ప్రభాస్ కల్మషం లేని వ్యక్తి అని, ఆయనకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదని ఎస్కేఎన్ అన్నారు. యూరప్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక విల్లా మొత్తం తీసుకుని, తన పర్సనల్ చెఫ్‌తో తెలుగు వంటలు చేయించి అందరికీ భోజనం పెట్టిన గొప్ప మనసున్న వ్యక్తి ప్రభాస్ అని భావోద్వేగంగా పేర్కొన్నారు.
ఇంతమంచి వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడకుండా ఎలా ఉంటాం? ప్రతి సంక్రాంతికి కోళ్ల మీద పందెం వేస్తాం. ఈసారి డైనోసార్ మీద పందెం వేయబోతున్నాం అంటూ ఎస్కేఎన్ చెప్పిన మాటలు ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపాయి.
Recent Random Post:















