
‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సక్సెస్తో నిర్మాత నాగవంశీ కూడా తన ధీమాను వ్యక్తం చేశారు. తన సినిమాను ఎవరూ ప్రమోట్ చేయకపోయినా, తానే ప్రచారం చేసుకుని రిలీజ్ చేసుకోగలనంటూ సవాల్ విసిరారు. అంతేకాదు, సినిమాపై వచ్చిన విమర్శల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, ఇకపై తన సినిమాలకు ఫిల్మ్ మీడియా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు.
ఈ నేపథ్యంలో ‘మ్యాడ్ స్క్వేర్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్ కూడా తనదైన శైలిలో స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “మ్యాడ్ ఆర్గానిక్ కామెడీ, రియలిస్టిక్ సిట్యుయేషన్ కలిగిన కాలేజ్ స్టోరీ. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు అంతా కనెక్ట్ అవుతారు. కానీ ‘మ్యాడ్ స్క్వేర్’ ఒక ఫిక్షనల్ కథ. ఇందులో ఓ భాయ్ క్యారెక్టర్ ఉంది. లైవ్లో అలాంటి పోలీస్ ఎక్కడైనా ఉంటాడా? ఇది పూర్తిగా ఫాంటసీ ఎలిమెంట్తో రాసిన కొత్త కథ. ప్రేక్షకులు దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు” అని స్పష్టం చేశారు.
అలానే, “ఒకసారి ‘బాహుబలి’ సినిమా చూసినప్పుడు నాకు అది అంతగా నచ్చలేదు. అప్పుడు నా ఫ్రెండ్ నాకు చెప్పాడు – ‘నువ్వు రాజమౌళి నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశావు, అందుకే నచ్చలేదని అనుకుంటున్నావు. కానీ, కామన్ ఆడియన్స్ ఆ కోణంలో చూడడం లేదు. మళ్లీ ఆ కోణంలో బాహుబలి చూడండి’ అని చెప్పాడు. తర్వాత మళ్లీ చూశాను, అర్థమైంది. ‘మ్యాడ్ స్క్వేర్’ విషయంలో కూడా కొందరు నాలాగా అనుకుని ఉండొచ్చు” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ సినిమా విజయవంతంగా నడుస్తుండటం, నాగవంశీ మరియు కళ్యాణ్ శంకర్ ధీమాతో ఉన్న తీరు చూస్తుంటే, ‘మ్యాడ్’ ఫ్రాంచైజీ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు!
Recent Random Post:














