
సూపర్ స్టార్ మహేష్ బాబు నిజంగా దర్శకుల హీరో. ఒక స్టార్‌ను తీర్చిదిద్దే శక్తి పూర్తిగా దర్శకుల చేతుల్లోనే ఉంటుందనే నమ్మకం గట్టిగా కలిగిన నటుడు ఆయన. రెండున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో దర్శకుడి విజన్‌కే కట్టుబడి పని చేస్తూ, వెండి తెరపై కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ వెనుకాడని నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ విషయంలో ఆయన తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణకు ఏమాత్రం తీసిపోరు.
ఏ పాత్ర అయినా, ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగడం మహేష్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే పరిశ్రమలో సూపర్ స్టార్‌గా ఎదిగారు. నటనలో ఓనమాలు తండ్రి నుంచే నేర్చుకున్నప్పటికీ, ఆ లెగసీని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన తనయుడిగా నిలిచారు.
సూపర్ స్టార్ వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ, ‘వారణాసి’ తర్వాత మహేష్ సినీ ప్రయాణం మరింత వైవిధ్యంగా సాగబోతోందన్నది ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన చూపిస్తున్న అంకితభావం అందరికీ తెలిసిందే. దాదాపు ఏడాది కాలం పాత్ర కోసమే పూర్తిగా మేకోవర్ అయ్యారు. వివిధ రకాల విలువిద్యలను నేర్చుకోవడంతో పాటు, కథకు మరియు పాత్రకు తగ్గట్టుగా తనని తాను పూర్తిగా మౌల్డ్ చేసుకున్నారు. రాజమౌళి కోసం మహేష్ తనను తాను అర్పించుకున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ‘వారణాసి’ విషయంలో ఆయన 200 శాతం రాజమౌళికి కట్టుబడి పనిచేస్తున్నారన్నది ఇప్పటికే స్పష్టమైంది.
రాజమౌళితో సినిమా చేయడం అంటే ఎలాంటి అనుభవమో ఇటీవల జరిగిన ఓ ప్రమోషన్ ఈవెంట్లో మహేష్ మాటల్లోనే స్పష్టంగా కనిపించింది. ఆ ఈవెంట్ కోసం తన పాత స్టైల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని ఆయన సరదాగా చెప్పారు. సాధారణ చొక్కా–ప్యాంట్‌తో రావాలనుకున్న మహేష్‌కు, రాజమౌళి మాత్రం “అలా కుదరదు” అంటూ తన స్టైల్లోనే రావాలని సూచించారు. దర్శకుడి మాటకు ఎప్పుడూ ‘నో’ చెప్పని మహేష్, టీషర్ట్ మరియు స్టైలిష్ డిజైనర్ ప్యాంట్లో మెరిశారు. భవిష్యత్తులో ఈవెంట్లలో మహేష్ మరింత కొత్త లుక్‌లో కనిపించబోతున్నారన్న హింట్ కూడా ఆయనే ఇచ్చారు.
ఇటీవల సినిమా కోసం మహేష్ మరో త్యాగం కూడా చేసినట్టు తెలుస్తోంది. ‘వారణాసి’ కోసం ఆయన రన్నింగ్ స్టైల్‌ను కూడా రాజమౌళి పూర్తిగా మార్చేశారట. సినిమాలో మహేష్ పోషిస్తున్న పాత్రకు తగ్గట్టుగా సరికొత్త రన్నింగ్ స్టైల్‌ను డిజైన్ చేశారు. గెటప్ నుంచి నిలబడే విధానం వరకు, పాత్ర అవసరాల మేరకు ఎన్నో మార్పులు చేసినట్టు సమాచారం. పురాణాలు, కాలప్రయాణం, సాహసయాత్ర వంటి అంశాలతో సాగే కథలో పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా మహేష్ అవుట్ అపియరెన్స్‌ను పూర్తిగా మార్చినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి మహేష్ సాధారణంగా పరుగెత్తే విధానానికే ప్రత్యేకమైన స్టైల్, స్వాగ్ ఉంటుంది. ఆ రన్నింగ్ స్టైల్‌కు ఎంతో మంది అభిమానులున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్లు కూడా మహేష్ రన్నింగ్ ఎంతో డిఫరెంట్‌గా, ఆకర్షణీయంగా ఉంటుందని పలుమార్లు ప్రశంసించారు. కొందరైతే ఆయన పరుగును జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌తో పోల్చిన సందర్భాలూ ఉన్నాయి. అయితే రాజమౌళి మాత్రం ఈ విషయంలో కూడా రాజీ పడలేదు. అన్ని కోణాల్లో తన విజన్‌కు తగ్గట్టుగా మహేష్‌ను ‘వారణాసి’ కోసం తీర్చిదిద్దారు. మహేష్ కూడా అంతే అంకితభావంతో దర్శకుడి ఆలోచనలకు పూర్తిగా సరిపోతూ పని చేస్తున్నారు.
Recent Random Post:















