వరుణ్ తేజ్ కొత్త ప్రయత్నాలు: కమబ్యాక్ కోసం కసరత్తు

Share


వరుస ఫలితాలతో వెనకబడిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఇప్పుడు సత్తా చాటేందుకు మరింత కష్టపడుతున్నాడు. ఫిదా, తొలిప్రేమ వంటి బ్లాక్‌బస్టర్ల తరువాత విజయానికి కొంత దూరంగా ఉన్న వరుణ్, గని, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవధారి అర్జున వంటి చిత్రాల వైఫల్యంతో ఒత్తిడికి లోనయ్యాడు. అయితే, గద్దలకొండ గణేష్ తరహా సక్సెస్ దక్కితే ఒక్కసారిగా మార్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ సినిమా చేస్తున్న వరుణ్, అనంతపురం తదితర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసి, తదుపరి షెడ్యూల్ కోసం కొరియాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి “కొరియన్ కనకరాజు” అనే టైటిల్ పరిశీలనలో ఉంది. గాంధీ గత చిత్రం హిట్ కాకపోయినా, కథ మీద నమ్మకంతో వరుణ్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

ఇక తాజా సమాచారం ప్రకారం, వరుణ్ తన తర్వాతి చిత్రాన్ని దర్శకుడు విక్రమ్ సిరికొండతో చేయబోతున్నాడు. గతంలో టచ్ చేసి చూడు సినిమాతో డైరెక్షన్‌లోకి వచ్చిన విక్రమ్‌కి పెద్దగా ఫలితం రాలేదు. అయినా రచయితగా రేస్ గుర్రం, మిరపకాయ్ లాంటి హిట్స్‌కి పనిచేసిన అనుభవం ఉంది. ఈసారి ఓ కొత్త బ్యాక్‌డ్రాప్‌తో న్యూ ఏజ్ లవ్‌స్టోరీను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుండటం విశేషం. యూవీ క్రియేషన్స్, మైత్రి వంటి టాప్ బ్యానర్లు వరుణ్‌తో పనిచేయడమే ఆయన మీద ఉన్న నమ్మకానికి నిదర్శనం. వరుస ఫెయిల్యూర్స్‌కి ముగింపు పలికి, ఈ రెండు ప్రాజెక్టులతో వరుణ్ తేజ్ మరోసారి ట్రాక్‌లోకి వస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.


Recent Random Post: