సోషల్ మీడియా ట్రోల్స్‌పై ప్రభుత్వం వార్నింగ్!

Share


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సోషల్ మీడియా వ్య‌వ‌హారాల‌పై క‌ఠిన వైఖ‌రి తీసుకుంది. ముఖ్యంగా మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, కుటుంబాలపై దూషణలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో జనసేన, టీడీపీ నాయకులు కూడా ఈ విషయంలో దృఢంగా స్పందించారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో కొన్ని అసభ్య పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సమయంలో కొందరు కావాలని నెగెటివ్ ప్రాచుర్యం కోసం ఈ పనులు చేస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో జనసేన కీలక నేత ఒకరు హెచ్చరిస్తూ, “విమర్శలు చేయడం సరే కానీ, కుటుంబాలను, మహిళలను లాక్కొచ్చి ట్రోలింగ్ చేయడం, అసభ్యంగా మాట్లాడడం అసహ్యకరమైన చర్యలు. ఇలా చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. వారి అసలైన గుర్తింపును కనుగొని, సైబర్ క్రైం ద్వారా కేసులు నమోదు చేస్తాం. మీ పోస్టులు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తుపెట్టుకోండి,” అన్నారు.

ఇప్పటికే పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ట్రోలింగ్, మార్ఫింగ్ ఫొటోలు పెట్టినవారిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఇలా చేసే వారిని పెద్దగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైనా సోషల్ మీడియాలో బతుకు తెగించి పోస్ట్ చేస్తే మాత్రం తప్పించుకోలేరన్న సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి.

ఇకపోతే ‘హరిహర వీరమల్లు’ సినిమా జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో పవన్‌పై ట్రోలింగ్ మరింత పెరగడంతో అభిమానులు, జనసేన నేతలు అధికారులను అప్రమత్తం చేశారు. ఇకపై సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు, కుటుంబాలపై అసభ్య వ్యాఖ్యలకు ఎలాంటి చోటు ఉండదని ప్రభుత్వమే స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది.


Recent Random Post: