మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డికి, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అత్యద్భుతమైన కానుక ఇచ్చేశారు. అదే, 100 కోట్ల జరీమానా. మైనింగ్ అక్రమాల నేపథ్యంలో వైఎస్ జగన్ సర్కార్, 100 కోట్ల జరీమానాని జేసీ దివాకర్‌రెడ్డికి సంబంధించిన మైనింగ్ కంపెనీలకు విధించింది. జరీమానా చెల్లించకపోతే, ఆస్తుల జప్తు కూడా చేస్తారట.
‘వైఎస్ జగన్ మావాడే..’ అంటూ పదే పదే వెటకారాలు చేసిన ఫలితమిది. వైఎస్ జగన్‌ని నానా రకాల బూతులు తిట్టిందుకు దక్కిన ‘రాజకీయ కానుక’ ఇది. రాజకీయాల్లో కక్ష సాధింపులు సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా వైఎస్ జగన్ హయాంలో, రాజకీయ ప్రత్యర్థుల్ని ‘వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు’ అన్నది నిర్వివాదాంశం. అలాగని, జేసీ దివాకర్‌రెడ్డి ‘ఉత్తముడు’ అని సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదు.
జేసీకి సంబంధించి అనేక వ్యాపారాలు వివాదాల్లో వున్నాయి. దివాకర్ ట్రావెల్స్, మైనింగ్ సంస్థలు.. ఇలా ఒకటేమిటి.? కాంగ్రెస్ హయాంలోనూ, టీడీపీ హయాంలోనూ జేసీ దివాకర్‌రెడ్డి అడ్డగోలు దోపిడీలకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. తప్పదు.. అనుభవించాల్సిందే ఇప్పుడు.
అలాగని, వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యల్నీ పూర్తిగా సమర్థించేయలేం. ఎందుకంటే, మైనింగ్ విషయంలో కావొచ్చు.. ట్రావెల్స్ విషయంలోగానీ.. దోపిడీలు ఆగలేదు. ఆయా నేతలు వైసీపీ వైపు వచ్చేస్తే, ఆటోమేటిక్‌గా ‘వేధింపులు’ ఆగిపోతున్నాయి. గతంలో టీడీపీలో పనిచేసిన పలువురు నేతలు ఇలాంటి బెదిరింపులతోనే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసేశారు మరి. అలాంటివారెవరికీ ‘జగనన్న కానుక’ అదేనండీ, జరీమానాలు లేవు. వారికి ఇంకోరకమైన కానుకలు లభిస్తున్నాయి.. అడ్డగోలు మైనింగ్ చేసుకునేలా వారందరికీ అవకాశం కల్పిస్తోందంటూ వైఎస్ జగన్ సర్కార్‌పై విమర్శలున్నాయి.
చంద్రబాబు హయాంలో వైసీపీపై వేధింపులు.. ఇప్పుడు జగన్ హయాంలో టీడీపీ మీద వేధింపులు.. అంతా సేమ్ టు సేమ్.. తక్కెడ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మొగ్గుతోందంతే.. దోపిడీ మాత్రం తప్పదంతే.!
Recent Random Post: