చీరాల నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరును అధిష్టానం సర్దుబాటు చేసినట్టుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం మధ్య గత కొంతకాలంగా ఆధిపత్యపోరు సాగుతోంది. దీనిని ఎప్పటికప్పుడు అధిష్టానం తాత్కాలికంగా సర్దుబాటు చేస్తూ వస్తున్నా.. మళ్లీ ఏదో ఒక వివాదం రాజుకుంటోంది.
ఈ నేపథ్యంలో తాజాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇరువరి మధ్య నెలకొన్న వివాదాలను వైసీపీ పెద్దలు సర్దుబాటు చేసినట్టు సమాచారం. ఆమంచికి పర్చూరు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు ఇవ్వడంతోపాటు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. అదే సమయంలో బలరాం చీరాల వ్యవహారలను చూసుకుంటారని సమాచారం. ఇక పంచాయతీ ఎన్నికల్లో ఇరువురి మధ్య నెలకొన్న వివాదాలను కూడా అధిష్టానం పరిష్కరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రామన్నపేట పంచాయతీకి మాత్రమే ఎన్నికలు జరుగుతుండగా.. అక్కడ ఆమంచి, కరణం వర్గీయులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు.
దీంతో అధిష్టానం రంగంలోకి దిగి సర్పంచ్ పదవిని రెండు వర్గాలకు చెందిన వ్యక్తులకు సగం సగం కాలం పంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తొలుత కరణం బలరాం వర్గానికి చెందిన రమణ అనే ఆమెకు అవకాశం ఇవ్వగా.. రెండున్నరేళ్ల తర్వాత ఆమంచి వర్గానికి చెందిన రాజ్యలక్ష్మిని సర్పంచ్ చేస్తారు. ఈ మేరకు ఇరు వర్గాలను అధిష్టానం ఒప్పించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక కరణం, ఆమంచి తమ తమ నియోజకవర్గాలకే పరిమితం కావాలని అధిష్టానం చెప్పినట్టు సమాచారం.
Recent Random Post: