కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికించేసింది.. వణికించేస్తూనే వుంది. ‘కొత్త వైరస్ ఏదో వచ్చిందట కదా.. అది చాలా ప్రమాదకమైనదట కదా..’ అన్న భయాందోళనలు కింది స్థాయిలో పెరిగిపోతున్నాయి. ‘అబ్బే, కరోనా ముప్పు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే మన దేశానికి తక్కువే.. దేశం కోలుకుంటోంది.. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది..’ అని నరేంద్ర మోడీ సర్కార్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. ఇంకో వైపు పరిస్థితి అత్యంత దయనీయం. కేరళలో కరోనా విజృంబిస్తోంది. మహారాష్ట్రలో పరిస్థితి భయానకంగా తయారవుతోంది. నిజానికి, ఓ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందంటే, ఆ ప్రభావం దేశమంతటిపైనా ఒకేలా వుంటుంది. ఎందుకంటే, సరిహద్దుల్లో ఎక్కడా సరైన నిఘా లేదు.. రాష్ట్రాల మధ్య. అలాంటప్పుడు, ఓ చోట విజృంభించి ఇంకో చోట మామూలుగా ఎలా వుంటుంది.? టెస్టింగ్, ట్రేసింగ్ సరిగ్గా జరగడంలేదు కాబట్టి.. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి ఆల్ ఈజ్ వెల్.. అన్నట్టుందన్నది కొందరు వైద్య నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది.
ఇదిలా వుంటే, కరోనా వైరస్ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఇంకా సరైన అవగాహన ఏర్పడలేదు. దేశవ్యాప్తంగా తొలి దశ టీకా పంపిణీ విజయవంతమయ్యిందని కేంద్రం చెబుతోంది. కానీ, వ్యాక్సిన్ కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఆ అంశంపై కేంద్రం ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం సరిగ్గా చేయడంలేదు.
ఇంకోపక్క, దేశం ఆర్థికంగా చితికిపోయింది కరోనా దెబ్బకి. అలా ఏర్పడ్డ అగాధాన్ని పూడ్చే క్రమంలో నరేంద్రమోడీ సర్కార్, ప్రజల నెత్తిన బారం మోపుతోంది వివిధ మార్గాల్లో. పెట్రో ధరలు పెరిగాయి.. గ్యాస్ సిలిండర్ భారయమైంది.. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటేస్తున్నాయి. ఎలా చూసినా, సామాన్యుడి బతుకు ఛిద్రమే.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ‘వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలనీ.. దేశ ప్రగతిలో భాగం పంచుకోవాలనీ’ మోడీ చెబుతున్న సూక్తులు బాగానే వున్నా, మోడీ సర్కార్ నుంచి సామాన్యుడి బతుకుకి భరోసా లభించకపోవడమే అత్యంత బాధాకరమైన విషయం.
Recent Random Post: