బానిస సంకెళ్ళు తెంచేసుకుని.. ఈటెల రాజేందర్ సంచలనం.!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి సైతం ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఇటీవలే మంత్రి వర్గం నుంచి గెంటివేయబడ్డ ఈటెల రాజేందర్, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై సుదీర్ఘంగా మంతనాలు జరిపి, చివరికి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

ఈటెలను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు తెలంగాణ అధిష్టానం యోచిస్తోందన్న ప్రచారం ఓ వైపు జరుగుతుండగా, ఈటెల తనంతట తానుగా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఈటెల, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ రాజీనామాకి ఆమోదం లభించడం లాంఛనమే. తెలంగాణ రాష్ట్ర సమితిలో గడచిన ఐదేళ్ళుగా బానిస బతుకు బతకాల్సి వచ్చిందంటూ ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీలో ఉద్యమకారులకు గౌరవం లేదనీ, మంత్రి పదవి ఇచ్చి తన నోరు నొక్కెయ్యాలని కేసీఆర్ అనుకున్నారనీ, ఐదేళ్ళ క్రితమే పార్టీ అధినేత కేసీఆర్‌తో గ్యాప్ వచ్చిందనీ, తెలంగాణ కోసమే ఇన్నాళ్ళూ అవమానం భరించాననీ ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. ఉద్యమంలో వున్నప్పుడు గొంగలి పురుగునైనా ముద్దాడతానన్న కేసీఆర్, గెలిచి గద్దెనెక్కాక.. ఉద్యమకారుల్ని గొంగలిపురుగుల కంటే హీనంగా చూస్తున్నారని ఆరోపించారు.

క్లిష్ట పరిస్థితుల్లో వున్నప్పుడు కేసీఆర్‌కి అండగా నిలిచిన తనలాంటి ఉద్యమకారుల్ని వెన్నుపోటు పొడిచారన్నది ఈటెల ఆవేదన. పార్టీలో కొందరు మాత్రమే సంతోషంగా వున్నారు.. తెలంగాణ రాష్ట్ర సమితి.. అంటే బీహార్‌లో లాలూ ప్రసాద్ నడుపుతున్న పార్టీ లాంటిది కాదంటూ ఈటెల చురకలంటించారు. ఎన్నికల్లో గెలవడం తనకు కొత్త కాదనీ, కేసీఆర్ రాజీనామా చేయమన్న ప్రతిసారీ ఆలోచించకుండా రాజీనామా చేశాననీ, తన నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించారని, తనను ఈ స్థాయి నాయకుడిగా మార్చారనీ, వారి కోసం.. తెలంగాణ సమాజం కోసం కొట్లాడతానని ఈటెల చెప్పుకొచ్చారు.


Recent Random Post: