కరోనా మొదటి వేవ్ విషయంలో ప్రభుత్వాల్ని పూర్తిగా తప్పు పట్టేయలేం. కానీ, సెకెండ్ వేవ్ విషయంలో మాత్రం వైఫల్యం ప్రభుత్వాలదే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా తక్కువ.. కేంద్ర ప్రభుత్వం వాటా చాలా చాలా ఎక్కువ. రాష్ట్రాల్ని అప్రమత్తం చేయాల్సిన కేంద్రం, పూర్తిస్థాయి నిర్లక్ష్యం ప్రదర్శించింది. రాష్ట్రాలు తమంతట తాము లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి తప్ప, కేంద్రం బాధ్యత తీసుకోలేకపోయింది. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానిది పూర్తి స్థాయి వైఫల్యం. మరి, ఇన్ని వైఫల్యాల్ని తమ దగ్గర పెట్టకుని ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ఈ రోజు సాయంత్రం ఏం ప్రసంగించనున్నారు.?
నిజానికైతే, సెకెండ్ వేవ్ నేపథ్యంలో చాలా కుటుంబాలు ఛిద్రమైపోయిన దరిమిలా, జాతికి క్షమాపణ చెప్పాలి ప్రధాని నరేంద్ర మోడీ.. అన్నది దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న వాదన. ‘రిజైన్ మోడీ’ అంటోంది దేశం. రాజీనామా, సమస్యకు పరిష్కారం అని చెప్పలేం. కానీ, ప్రభుత్వాధినేతగా ఈ వైఫల్యాలకు నరేంద్ర మోడీ నైతిక బాధ్యత వహించి తీరాల్సిందే.
వ్యాక్సినేషన్ ప్రక్రియ అడ్డగోలుగా మారడానికి కారణం కేంద్రం వైఖరి. వ్యాక్సిన్ ఉత్సవ్.. అంటూ పబ్లిసిటీ స్టంట్లయితే చేశారుగానీ, అవసరమైన మేర వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులు మంజూరు చేయడంలో అలసత్వం.. స్వదేశీ వ్యాక్సిన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో వైఫల్యం.. ఇలా ఎలా చూసినా వైఫల్యమే కనిపిస్తోంది.
సాయంత్రం ఇళ్ళ నుంచి బయటకొచ్చి బాల్కనీల్లో నిల్చుని చప్పట్లు కొట్టండి.. గిన్నెలు, గరిటెలు పట్టకుని బాదండి.. వంటి పరమ రొటీన్ మాటలు మోడీ, జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో చెబితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. మాస్కులు ధరించండి.. సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి.. అంటూ క్లాసులు చెప్పినా ప్రయోజనం లేదు. తమవారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాల వేదనకు మోడీ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అంతటి చిత్తశుద్ధిని ఆశించలేం. షరామామూలు పబ్లిసిటీ స్టంట్లే వుండొచ్చు ఆయన ప్రసంగంలో. అసలాయన ప్రసంగం గురించి దేశం ఎదురుచూసే పరిస్థితి అయితే లేదు.
Recent Random Post: