వైసీపీ కొంప ముంచుతున్న రఘురామకృష్ణరాజు ‘విధేయత’

ఇదేం విధేయత మహాప్రభో.. అంటూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. అదేనండీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలియాస్ వైఎస్సార్సీపీ అలియాస్ వైసీపీ కార్యకర్తలు నెత్తీ నోరూ బాధుకుంటున్నారు రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాస్తున్న లేఖలు, చేస్తున్న వ్యాఖ్యల కారణంగా. విధేయత అంటే ఎలాక్కూడా వుంటుందా.? అని అంతా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.

రాజద్రోహం కేసులో అరెస్టయిన రఘురామ, బెయిల్ పొందారు.. బెయిల్ షరతుల నేపథ్యంలో మీడియాతో మాట్లాడకూడదు. అయితేనేం, ఆయన వైసీపీకి చెయ్యాల్సిన డ్యామేజ్.. చెయ్యాలనుకున్న రీతిలో నిరాటంకంగా చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే మూడు లేఖలు రాసిన రఘురామ, తాజాగా నాలుగో లేఖని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత వినయపూర్వకంగా రాశారు.

ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విషయమై రఘురామ తాజా లేఖలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. ఈ లేఖల ద్వారా రఘురామ తన వినయాన్ని, విధేయతని చాటుకుంటున్నారా.? లేదంటే, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపుతున్నారా.? అన్న విషయమై వైసీపీ శ్రేణుల్లో గందరగోళం షురూ అయ్యింది.

నిన్న మొన్నటిదాకా చేసిన రాజకీయ విమర్శల సంగతెలా వున్నా, ఇప్పుడు రఘురామ సంధిస్తున్న లేఖాస్త్రాల్లో ప్రతి పాయింట్ కూడా విలువైనదే. తమ ప్రభుత్వం ఏ విభాగంలో వైఫల్యం చెందుతోందో స్పష్టంగా రఘురామ పేర్కొంటున్నారు. దీన్ని వైసీపీలో ఏ నాయకుడూ ఖండించడానికి వీల్లేని పరిస్థితి. ‘అన్నీ చేసేశాం..’ అని మీడియా ముందుకొచ్చి గంటల తరబడి ప్రసంగాలిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న వైసీపీ నేతల నోళ్ళకు ఈ లేఖలు తాళాలేసేస్తున్నాయన్నది నిర్వివాదాంశం.

గ్రామ సచివాలయాల్లో వున్న ఖాళీల్నీ, వివిధ విభాగాల్లో వున్న ఖాళీల్ని తన లేఖాస్త్రంలో తాజాగా పొందుపరిచారు రఘురామ. ఇప్పుడీ వ్యవహారం వైఎస్ జగన్ సర్కారుకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందనే అనుకోవాలి. అన్నట్టు, వైసీపీ వెబ్ సైటు నుంచి రఘురామ పేరు ఎంపీ కోటా నుంచి తొలగించారట. దీనిపై వివరణ కోసం ఆయన పార్టీ అధిష్టానానికి.. అదేనండీ ముఖ్యమంత్రికి లేఖ రాయడం కొసమెరుపు.


Recent Random Post: