అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు పూర్తిగా ఇకపై తాళాలు పడిపోయినట్లే. ఇకపై ప్రత్యేక హోదా కోసం ఎవరూ మాట్లాడాల్సిన పనిలేదు. అసలు ఆ విషయం గురించి ఆలోచించి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వున్నన్నాళ్ళూ ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. అయినా, అడుగుతూనే వుంటారట. ఇదెక్కడి లాజిక్.?
2019 ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాం.? అంతకు ముందు ఊరూ వాడా.. విద్యార్థుల్ని ఎంతలా రెచ్చగొట్టాం.? కేంద్రం మెడలు వంచేస్తామని ఎందుకలా ప్రగల్భాలు పలికాం.? అన్న విషయమై వైసీపీ ఆత్మవిమర్శ చేసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మాట తప్పడం, మడమ తిప్పడంలో మిగతా రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోరు. ‘చెప్తారంతే.. చెయ్యరంతే..’ అన్న విషయం ఇంకోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలోనూ నిరూపితమైపోయింది. ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేస్తారు.. బంద్, ధర్నాలంటారు.. ఎంపీలతో రాజీనామాలు చేయిస్తారు.. అవన్నీ జస్ట్ పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే. ఎలాగైనా అధికారంలోకి రావాలి గనుక, ఏదో ఒక అంశాన్ని పట్టుకుని రాజకీయం చేయాలి.
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిందదే. జనానికే అసలు విషయం అర్థం కాలేదు. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్.. ఏం మారిందని.? బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక, కేంద్రంపై చంద్రబాబు గట్టిగా నినదించారు.. అదీ ముఖ్యమంత్రి హోదాలో. ఆ పాటి తెగువ కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో వున్నట్టు లేదు. ఎన్డీయేలో వైసీపీ భాగం కాదు. మరెందుకు కేంద్రాన్ని నిలదీయాలంటే భయం.?
Recent Random Post: